Sunday, January 19, 2025
HomeTrending Newsవిశాఖ విశ్వనగరం: బుగ్గన

విశాఖ విశ్వనగరం: బుగ్గన

అన్ని రంగాలకు, అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని… యువ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా రాష్ట్ర అడుగులు వేస్తోందని  ఏపీ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.  ఆంధ్రావనికి నలుదిక్కులా..అవధుల్లేని అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే పారిశ్రామిక ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతోందని వెల్లడించారు.  విశాఖపట్నం విశ్వనగరం కానుందని,  వైజాగ్ లాంటి ప్రాంతం గ్లోబ్ లో ఎక్కడా దొరకదని మంత్రి స్పష్టం చేశారు.  విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహకాల్లో భాగంగా  బెంగుళూరులో ‘ బెంగుళూరు ఇండస్ట్రీ మీట్’  పీరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో బుగ్గన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, నైపుణ్యం, గృహ నిర్మాణం, వైద్య రంగాలకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తోందని,  పాతికేళ్ల క్రితం ఒకటి, రెండు పరిశ్రమలు మాత్రమే ఉండేవని  ఇప్పుడు పరిశ్రమల హబ్ లు గా ప్రధాన నగరాలు తయారయ్యాయని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాలు, మానవవనరులే పెట్టుబడులకు పునాది అని మంత్రి అభిప్రాయపడ్డారు. సామాజిక, ఆర్థిక , పర్యావరణ ప్రమాణాల ఆధారంగా నీతి ఆయోగ్ ప్రకటించిన అనువైన వాతావరణమున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ది నాలుగో స్థానమని చెప్పారు. రాష్ట్రం లోపల, వెలుపలా రవాణా ఖర్చు తగ్గించేందుకు ‘ఇన్ లాండ్ వాటర్ వే పాలసీ’ తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 27 ప్రాంతాలను గుర్తించాం..2029 కల్లా 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్వహించేలా అడుగులు వేస్తున్నామన్నారు.

పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన విస్తారమైన ల్యాండ్ బ్యాంక్ (48,352 ఎకరాలు) ఉందని , బల్క్ డ్రగ్ పార్క్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తోందని,  దక్షిణ భారతదేశంలో  రూ.వెయ్యికోట్ల తోడ్పాటుతో పార్కును దక్కించుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని మంత్రి బుగ్గన అన్నారు.  3 కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని,  రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని 26 నైపుణ్య కళాశాలల అభివృద్ధి   చేస్తున్నామన్నారు.

హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్,ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి. చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ ప్రత్యేక కార్యదర్శి సుందర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో శ్రీధర్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్