మంత్రులు, సలహాదారు పదవులకు అవసరం లేని పదో తరగతి నిబంధన షాదీ తోఫా కు ఎందుకని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ముస్లిం యువతుల వివాహాల కోసం లక్ష రూపాయలు ఇస్తామని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు ఎన్నో నిబంధనలు పెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో పెళ్ళిళ్ళు చేసుకుంటే, 300 యూనిట్లు కరెంట్ బిల్లు దాటితే ఈ పథకం వర్తించదంటూ నిబంధనలు పెట్టారని, ఎన్ని రకాలుగా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వంలో దుల్హన్ పథకం ఏర్పాటు చేసి కళ్యాణ మిత్రల ద్వారా పెళ్లి జరిగే రోజునే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేసే విధంగా చూశానని, కానీ వైసీపీ ప్రభుత్వం ఈ పథకం నిలిపి వేసిందన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’లో భాగంగా పొన్నూరులో పర్యటిస్తున్న చంద్రబాబు…నేడు ముస్లింలతో ముఖా ముఖి కార్యక్రమంలో మాట్లాడారు. తాము అధికారం లోకి రాగానే దుల్హన్ పథకాన్ని పునరుద్ధరించి లక్ష రూపాయల సాయం అందిస్తామని, వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ రిజర్వేషన్స్ ను కాపాడేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తామని, ఈలోగా వారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. తాను సిఎం అయిన తరువాత 13 జిల్లాల్లో ఉర్దూ ను రెండో భాషగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. హజ్ యాత్రికుల సౌకర్యార్ధం హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా హజ్ భవన్ ఏర్పాటు చేశానని బాబు పేర్కొన్నారు. నాడు వాజ్ పేయి హయాంలో తొలి ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో తానే తీసుకు వచ్చానని, 2014 తర్వాత కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీ కూడా తానే నెలకొల్పానన్నారు. తమ హయంలో 10 లక్షల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించామని, దీనితో పాటు సంక్రాంతి కానుక కూడా వారికి అందించానన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై అందరూ ప్రశ్నించాలని, మమల్ని ఏమీ అనడం లేదు కదా అని ఇంట్లో కూర్చుంటే రేపు మన మీదకు వచ్చినప్పుడు ఎవరూ రారన్న విషయం దృష్టిలో పెట్టుకొవాలని విజ్ఞప్తి చేశారు.