చంద్రబాబుకు ప్రజలు 2014లోనే లాస్ట్ ఛాన్స్ ఇచ్చారని, మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వబోరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయాన్ని మంత్రి బొత్సతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నేతలు కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల నిన్నటి కర్నూలు జిల్లా పర్యటనలో బాబు లాస్ట్ ఛాన్స్ వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెళుతున్నాయని, అన్నివర్గాలు సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు తన భార్యను తానే రోడ్డు మీదకు తీసుకొచ్చి అవమానిస్తున్నారని, పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ… ప్రజలు జాలి చూపిస్తారని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు, ఇకపై ఆయనకు ఛాన్స్ ఉంటుందని తాను అనుకోవడం లేదని, దింపుడుకళ్ళెం ఆశలకు పోతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకూ బాబు ఈ అంశాన్ని మాట్లాడుతూనే ఉంటారని, అయన ఏడుస్తున్నారనో, బాధపడుతున్నారనో ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవరని, ఎవరు మంచి చేస్తారో వారికే అండగా ఉంటారని సజ్జల అన్నారు. ఈ విషయం బాబు ఇంకా గ్రహించినట్లు లేరని, ఆయనకు తెలిసిన విద్య అదొక్కటే కాబట్టి దాన్ని పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు.
పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు సజ్జల. పార్టీ పెట్టినప్పటినుంచీ తాను జగన్ తో ఉన్నానని, సీనియర్ కార్యకర్తగా ఉన్నానన్నారు. తనకున్న అనుభవాన్ని వినియోగించి సిఎం ఆదేశాలను, ఆలోచనలను, కార్యక్రమాల అమలును చూస్తున్నానని సజ్జల వివరించారు. దీనిమీద ఎవడో ఏదో అన్నాడని దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని.. తనకున్న పరిమిత సమయాన్ని వృధా చేసుకోబోనని స్పష్టం చేశారు.
Also Read : రాష్ట్రాన్ని కాపాడుకుందాం: బాబు