చంద్రబాబు సిఎం గా ఉండగా రాయలసీమకు అన్ని విధాలుగా అన్యాయం చేశారని, ఇక్కడ హైకోర్టు వస్తుంటే అది కూడా వద్దంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదని, అక్కడ శాసన రాజధాని ఉంటుందని, కానీ వారు మాత్రం దురుద్దేశంతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కడప వైయస్సార్‌సీపీ కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి అని, అయన కృషితో గొల్లపల్లి ప్రాజెక్టులో నీరు రావడం వల్లనే అక్కడ కియా పరిశ్రమ ఏర్పాటైందన్న విషయాన్ని ఎవరైనా చెబుతారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నాడు వైయస్సార్ మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో గండికోటను, ఆయన తనయుడు జగన్ పూర్తి చేశారని, అదే విధంగా పోతిరెడ్డిపాడు నుంచి 11 వేల క్యూసెక్కులకు బదులు 76 వేల క్యూసెక్కులు వచ్చేలా చేశారని వివరించారు.
సిఎం జగన్ దూరదృష్టితో పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుడితే కొందరు స్వార్ధంతో వ్యతిరేకిస్తూ అమరావతి మహా పాదయాత్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్కడ భూములు ధరలు మళ్లీ పెరగాలని, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ, రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తున్నారని, ఆడికార్లు, ఐఫోన్‌లు, ఐవాచ్‌లు పెట్టుకుని పాదయాత్ర చేస్తున్న వారు, ఒకరోజు రొటీన్ కార్యక్రమంగా నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ఆరోగ్యం కోసం ఎంత దూరం నడిచానమనేది చూసుకుంటూ పాదయాత్ర చేస్తూ…. డ్యాన్స్ లు చేస్తున్నారని, వారి నాటకాలు, ఆర్భాటాలు చూస్తుంటే అసలు దాన్ని పాదయాత్ర అంటారా అని ప్రశ్నించారు. నిజానికి అది పాదయాత్ర కాదు. ఉత్తరాంధ్రపై ఒక దండయాత్రలా వారి పాదయాత్ర కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.