బిజెపి నాయకుడు, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ రాశారు. వెనువెంటనే శంషాబాద్ నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధితో సమావేశం అయ్యారు. వివేక్ చేరిక కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలాన్ని తీసుకువచ్చిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
బిజెపిలో మ్యానిఫెస్టో కమిటి చైర్మన్ గా ఉన్న వివేక్ పార్టీ మారటం బిజెపికి శరఘాతమనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బిజెపిలో చేరిన వివేక్ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన నేతలు మునుగోడు ఎన్నికల సమయంలో ఎంత చురుకుగా ఉన్నారో… పార్టీని గాడిలో పెట్టిన బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి అకస్మాత్తుగా కిషన్ రెడ్డికి అప్పగించటం.. మద్యం కేసు మొదలైయ్యాక క్రమంగా మౌనం వహిస్తూ వచ్చారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినా అది జరగలేదు. కేసులో ఎంతోమందిని అదుపులోకి తీసుకుంటున్న విచారణ సంస్థలు కవితను అరెస్టు చేయకపోవటంతో ఈ నేతలకు అనుమానాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ – బిజెపి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఇటీవల కాంగ్రెస్ అన్ని వేదికల మీద ప్రచారం చేస్తోంది. వీరి అనుమానాలకు ఈ ప్రచారం బలం చేకూర్చినట్లయింది.
మొదటి లిస్టులోనే వివేక్ ను చెన్నూర్ అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. అయినా పార్టీ మారటం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ – బిజెపిల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంటె… బిజెపిలో ఉన్నా భవిష్యత్తు శూన్యమని, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రావటం కష్టమని వివేక్ భావించినట్టు సన్నిహితులు చెపుతున్నారు.
బీజేపీ గుర్తు కంటే కాంగ్రెస్ గుర్తుతో ప్రజల్లోకి వెళితే.. చెన్నూరు సెగ్మెంట్ లో గెలుపు ఈజీ అవుతుందని పలువురు సన్నిహితులు వివేక్ కు సూచించినట్టు తెలుస్తోంది. చెన్నూరు టికెట్ తన కుమారుడు గడ్డం వంశీకి, పెద్దపెల్లి పార్లమెంట్ సీటు తనకు ఇవ్వాలని రాహుల్ తో హామీ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న వివేక్… అనేక క్లిష్ట సమయాల్లో ఉద్యమకారులకు అండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. వివేక్ కాంగ్రెస్ లో ఉన్నా గులాబీ అధినేత కెసిఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా వెలుగు వెలిగిన వెంకటస్వామి కుటుంబం, స్వరాష్ట్రం వచ్చాక వివేక్ తప్పటడుగులతో వారి ప్రతిష్ఠ కొంత మసకబారింది.
తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2 జూన్ 2013న కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్‌లో చేరాడు. 2014లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి ఎంపి సీటుకు వివేక్ పోటీ పడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2016లో టీఆర్‌ఎస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితుడయ్యాడు.
వివేక్ కోరిక మేరకే బలహీనమైన అభ్యర్థిగా సుమన్ ను పెద్దపల్లి బరిలో నిలిపారనే ప్రచారం ఆ ఎన్నికల్లో జోరుగా సాగింది. ఆ మాట కొస్తే వివేక్ తప్పుడు అంచనాలతో ఓటమి చవి చూడగా… ఈయన వైఫల్యాలు బాల్క సుమన్ కు పదవులు దక్కేట్టు చేశాయని విశ్లేషణలు ఉన్నాయి. సిఎం కెసిఆర్, మంత్రి కేటిఆర్ లకు సన్నిహితుడిగా పేరున్న సుమన్ ను చెన్నూరులో ఇప్పుడు ఎదుర్కోవటం అంత సులువు కాదు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి 25 మార్చి 2019న వివేక్ రాజీనామా చేశాడు. ఆగస్టు 9 2019లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా, ఇటీవల పార్టీ మ్యానిఫెస్టో కమిటి చైర్మన్ గా నియమితుడయ్యాడు.
తండ్రి వెంకటస్వామి ఓటమి ఎరుగని నేత కాగా వివేక్ ఒకసారి మాత్రమే ఎంపిగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి, చెన్నూరులో వివేక్ కు ప్రజాదరణ ఉన్నా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియక నియోజకవర్గాల ప్రజలు సతమతం అవుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ లో నిలకడగా ఉండి పెద్దపల్లి బరిలో దిగితే వివేక్ కి విజయావకాశాలు ఉన్నాయనే ఆ పార్టీ నేతలు అంటున్నారు.
-దేశవేని భాస్కర్