Saturday, November 23, 2024
HomeTrending NewsBJP: అయోమయంలో తెలంగాణ బిజెపి

BJP: అయోమయంలో తెలంగాణ బిజెపి

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో కమల వికాసం తగ్గుతోందా అనిపిస్తోంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బిజెపి నైరాశ్యంలో మునిగింది. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు పర్యటించినా ద్వితీయ స్థాయి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించటం లేదు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి నిజామాబాద్ సభలో సిఎం కెసిఆర్ గురించి ప్రస్తావించిన అంశాలు బిజెపితో పోలిస్తే బీఆర్ఎస్ కే ఎక్కువ మేలు చేశాయని విశ్లేషణలు ఉన్నాయి. ప్రధాని స్థాయిలో ప్రస్తావించాల్సిన అంశాలు కాదని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఎన్నికల సరళిపై జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డ రాష్ట్ర నాయకత్వంతో తరచుగా చర్చిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యశుడిగా కిషన్ రెడ్డి వచ్చాక పార్టీ కార్యక్రమాల తీరే మారిపోయిందని కార్యకర్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉండేవిధంగా కార్యక్రమాలు..ఏ చిన్న ఘటన జరిగినా బిజెపి నేతలు ఆందోళనలు నిర్వహించేవారని గుర్తుచేసుకుంటున్నారు.

శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మొదటి లిస్టు విడుదల చేసింది. బీఆర్ఎస్ ఏకంగా బీ ఫారాలు అందిస్తోంది. బిజెపిలో మాత్రం  చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో టికెట్ దక్కాని వారు వస్తే ఇస్తారా ఏందీ? గురువారం మొదటి లిస్టు అంటున్నారు చూడాలే.

అందరు ప్రచారంలో దూసుకుపోతుంటే బిజెపిలో ఆ జాడ లేదు. టికెట్ ఎవరికీ వస్తదో తెలవది..ఎందుకు ఉరుకులాట అంటున్నరు నేతలు. ఇటీవల OBC మోర్చా సమావేశంలో జనసమీకరణ ప్రస్తావన వస్తే…ఎంపి లక్ష్మణ్ కు ముఖం మీదనే చెప్పిండ్రంట ఇదే విషయం.

ఇప్పటికే పార్టీ పరేషాన్ ల ఉంది అంటే చంద్రబాబుకు అన్యాయం జరుగుతోంది అని కిషన్ రెడ్డి ఒకటే విమర్శలు చేస్తున్నడు.  లోకేష్ ను వెంట తీసుకొని మరి అమిత్ షాను కిషన్ రెడ్డి కలవటం బిజెపికి ఎంతవరకు మేలు చేస్తుందో చూడాలి. అసలు సంగతి ఎందా అని శ్యాం ప్రసాద్ ముఖర్జీ భవన్ లో తెలుసుకుంటే…రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్ల కోసం తండ్లాట అని బయటపడ్డది.

ఈ క్రమంలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు జనసేన అధినేతతో సమావేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినపుడు తాను 15 రోజులు అన్నం తినలేదని…ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్ విషం కక్కుతున్నాడు.

బిజెపి నేతలు ఇద్దరు రాష్ట్ర స్థాయి కన్నా… హైదరాబాద్ స్థాయి నేతలుగానే వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కేవలం హైదరాబాద్లో గెలుస్తే చాలు..జిల్లాల్లో అవసరం లేదా అని మండిపడుతున్నారు.

పార్టీ అగ్రనేతలే బీఆర్ఎస్ కు ప్రచార అస్త్రాలు అందిస్తున్నారని కమలం నేతలు నిందిస్తున్నారు. తెలంగాణలో బిజెపి నేతల గెలుపు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల ప్రభావం కన్నా… స్థానికంగా వారికి ఉన్న పట్టు, ప్రజాభిమానం మీదనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్