Sunday, January 19, 2025
HomeTrending Newsబీఆర్ఎస్ తొలి సభ విఫలం - బండి సంజయ్

బీఆర్ఎస్ తొలి సభ విఫలం – బండి సంజయ్

బీఆర్ఎస్ తొలి సభ ‘‘ప్రీ రిలీజ్ ఫంక్షన్’’ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆలయం కట్టి ఎట్లా వ్యాపారం చేయాలో చూపించడానికే సీఎంలను యాదాద్రి తీసుకెళ్లారని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి ‘జై తెలంగాణ’ అనే పదాన్ని విస్మరించిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. మతతత్వం గురించి మాట్లాడుతున్న నేతలు హిందూ దేవుళ్లను, మతాన్ని కించపరిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని, అది మతతత్వం కాదా? అని ప్రశ్నించారు. మోదీని తిట్టడానికి, బీజేపీని విమర్శించడానికే బీఆర్ఎస్ సభ పెట్టారే తప్ప తెలంగాణలో చేసిన అభివ్రుద్ధి ఏమీ లేదన్నారు.  ఈరోజు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, ఢిల్లీలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజు తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో బీఆర్ఎస్ సభ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ పేరుతో కేసీఆర్ నిర్వహించిన ‘‘ప్రీ రిలీజ్ ఫంక్షన్’’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. డబ్బులిచ్చి, బెదిరించి ప్రజలను తీసుకొచ్చి సభను సక్సెస్ చేసేందుకు విఫలయత్నం చేశారు.

• కేసీఆర్ దగ్గరకు ఒకసారి వచ్చినోళ్లు మళ్లీ రారు… కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి రాలే.. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాలే… నిన్న ఖమ్మం సభకు వచ్చినోళ్లు మళ్లీ కేసీఆర్ కు కనపడరు.. లిక్కర్ దందా సొమ్మును ఆ లీడర్లకు పంచి పెట్టారు.

• యాదాద్రి టెంపుల్ కు ముగ్గురు సీఎంలను తీసుకుపోతే ఆ రూట్ లో ప్రయాణీకులు నరకం చూశారు. 4 గంటలపాటు భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక సీఎం అసలు గుడిలోకే రానన్నడు.. యాదాద్రి ఆలయంతో ఎట్లా వ్యాపారం చేస్తున్నమో చెప్పడానికే కేసీఆర్ వాళ్లను తీసుకుపోయినట్లుంది.

• కేసీఆర్ గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పేర్లు ప్రస్తావించేటోడు. ఇయాళ ఆ పేర్లు లేవు. ఎందుకంటే ఆ దేశాలు అడక్కుతినే దుస్థితి. కేసీఆర్ నోట ఏ దేశం పేరొచ్చినా ఆ దేశం ఔట్ అవుతోంది. చైనా కరోనాతో చస్తోంది. దయచేసి కేసీఆర్ భారత్ బాగుందనే చెప్పొద్దని కోరుతున్న. ఎందుకంటే నీ నోరు మంచిది కాదు..

• 5 వేల టీఎంసీల నీళ్లను ఎట్లా నిల్వ చేస్తావ్? దేశం గురించి తరువాత క్రిష్ణా, గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటాలో సగం కూడా వాడుకోలేని నువ్వు మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది.

• 2014లో తెలంగాణ 18 లక్షల బోర్లున్నయ్… వ్యవసాయానికి సాగు నీరందిస్తే బోర్ల సంఖ్య తగ్గాలి. కానీ ఇప్పుడేమైంది? వ్యవసాయ బోర్ల సంఖ్య 24 లక్షలకు పెరిగింది. నిజంగా ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తే బోర్ల సంఖ్య తగ్గాలి కదా…

• తెలంగాణలో 24 గంటల వ్యవసాయ విద్యుత్ ను ఎక్కడా సరఫరా చేయడం లేదు. ఇయ్యడం లేదని నేను నిరూపిస్తా… నీకు నిరూపించే దమ్ముందా? పొలం కాడ ఫ్రీ కరెంట్ ఇస్తూ… ఇండ్ల కాడ కరెంట్ ఛార్జీలు పెంచి దోచుకుంటున్నవ్.

• డిస్కంలను వేల కోట్ల నష్టాలపాల్జేసినవ్. ఆ డబ్బులు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ అంధకారంలో ఉండే పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వస్తే మేం చెల్లిస్తాం… అప్పుడు బీజేపీయే ఫ్రీ కరెంట్ ఇచ్చినట్లు.

• స్వర్గీయ బిపిన్ రావత్ ఆలోచన ‘అగ్ని పథ్’. ఆయనకంటే నువ్వు తోపుగాడివా? నీకు ఏం తెలుసని అగ్నిపథ్ గురించి మాట్లాడుతున్నవ్… మళ్లీ పాత పద్దతి తీసుకెళతానంటున్న కేసీఆర్…. మళ్లీ నెహ్రూ హయాంలోకి వెళతావా? ఆ సంగతి తరువాత తెలంగాణలో పోలీసు నియామకాల సంగతి చూడు… గందరగోళంగా మారితే ధర్నాలు చేసిన వాళ్లను, అడిగిన వాళ్లను లాఠీలతో కొడుతున్నరు.

• మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అట… నెత్తిన టోపీ పెట్టుకుని తుపాకీ రాముడి లెక్క మాట్లాడుతున్నడు… వందే భారత్ రైలు ఈ దేశ టెక్నాలజీతో తయారైంది. మొబైళ్ల తయారీలో రెండో స్థానంలో ఉన్నం… కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడే తయారీ చేస్తున్నం. బొమ్మల తయారీలో ముందున్నం.

• మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఇస్తాడట… నీ పక్కనున్న అఖిలేష్ యాదవ్ కు తెలిస్తే రెండు దెబ్బలేసి పోయేటోడు. మహిళా బిల్లును చింపేసిన పార్టీ అది. నీ తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు స్థానం కల్పించలేదు. ఈ కేబినెట్ లో ఎంతమందికి చోటు కల్పించినవ్? అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఆపలేనోడు మహిళల గురించి మాట్లాడుతున్నడు.

• దళిత బంధును దేశమంతా ఇస్తాడట… ఎంతమందికి తెలంగాణలో ఇచ్చినవ్. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు. దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు 3 ఎకరాలిస్తానని మాట తప్పినోడివి నువ్వు. దళితులను ఏటా 1.25 లక్షల మందికి చొప్పున ఒక్కొక్కరికి రూ.10 కోట్లదాకా రుణాలిచ్చి పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఘతన మోదీదే.

• ఖమ్మం సభలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే మాట మార్చిపోయినట్లున్నడు… ఉచ్చరించలేదు. కేసీఆర్ ఈసారి ‘జై తెలంగాణ’ అనే పదమే ఉచ్చరించని తెలంగాణ ద్రోహి.

• ఖమ్మం సభకు వచ్చినోళ్లు ఒక్కరు కూడా బీఆర్ఎస్ పేరును ఉచ్చరించలేదు. కేజ్రీవాల్ ఈసారి దేశంలో అధికారంలోకి వచ్చేది ఆప్ అంటడు… సభకు వచ్చినోళ్లు స్కాంలో ఇరుక్కుపోయారు. ఒకరు గోల్డ్ స్కాంలో, లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోయారు. పంజాబ్ సీఎం, తెలంగాణ సీఎంలు తాగి ఊగడంలో దోస్తులు (జాన్ జబ్బలు).

• కమీషన్ల బాధలు భరించలేక తెలంగాణకు రావాల్సిన రూ.25 వేల కోట్లను ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతుంటే సిగ్గు లేకుండా రూ.2 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయని చెబుతున్నరు.

• మతం గురించి మాట్లాడుతున్నరు… దేవుళ్లను కించపరిస్తే మతతత్వం కాదా? హిందువులను చంపాలంటే మత తత్వం కాదా? రజాకార్ల పార్టీతో కలిసి తిరుగుతున్నరు… అది మతతత్వం కాదా? మీరా…. మతతత్వం కాదా?

• నిన్న నిజాం మనువడు చనిపోతే… అక్కడునోళ్లెవరూ ముస్లిం టోపీ పెట్టుకోలే… కేసీఆర్ మాత్రం టోపీ పెట్టుకుని నేనే నిజమైన ముస్లింగా చెప్పుకునే యత్నం చేస్తున్నడు..

• కంటి వెలుగు పథకం కోసం వచ్చామని ఇతర రాష్ట్రాల సీఎంలు చెప్పినరు. ఆ పేరుతోనే కేసీఆర్ సభ నిర్వహించినట్లున్నడు..

• ఏ జిల్లాకు పోయినా రూ.50 కోట్లు ఇస్తా… ఇంజనీరింగ్ కాలేజీ పెడతానంటడు.. పంచాయతీలకు రూ.10 లక్షలు ఇస్తానంటడు.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తానంటున్నడు.. అందరూ కేసీఆర్ మాటలు విని నవ్వుకుంటున్నరు. జర్నలిస్టులు కోవిడ్ తో చస్తుంటే పట్టించుకున్న పాపాన పోలేదు… మోదీగారిచ్చిన ఇండ్లనే ప్రజలకు ఇస్తలేవు? నువ్వు ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్?

• మోదీని తిట్టడానికి, బీజేపీని బదనాం చేయడం తప్ప కేసీఆర్ సాధించిందేమీ లేదు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో చేసిన అభివ్రుద్ధి ఏమిటో చెప్పాలి…

• మిషన్ భగీరథను దేశమంతా అమలు చేస్తాడట… ఆ పథకమే అట్టర్ ప్లాప్ అయ్యింది. నా పాదయాత్రలో యాడికి పోయినా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని.. వచ్చిన చోట మురికి నీళ్లే వస్తున్నాయని చెప్పారు.. నేను నిరూపిస్తా…

• దేశంలో మూతపడ్డ ఫ్యాక్టరీలను తెరిపిస్తాడట… తెలంగాణలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, రియాన్ సంస్థలను తెరిపిస్తానని మాట ఇచ్చి తప్పినవ్… ఏమైంది?

• తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్… ఆయన పుట్టిన రోజున సెక్రటేరియేట్ ను ప్రారంభిస్తాడట…. పేద ప్రజల రక్తం తాగే నరరూప రాక్షసుడు కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ఎట్లా ప్రారంభిస్తారు? అంబేద్కర్ పై ప్రేమ ఉంటే ఏప్రిల్ 14న ఎందుకు ప్రారంభించరు. అంబేద్కర్ పుట్టిన రోజున ప్రారంభిస్తే కేసీఆర్ కు ఉన్న అభ్యంతరం ఏముంది?

RELATED ARTICLES

Most Popular

న్యూస్