జనవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. కర్నూలు, హిందూపురం పార్లమెంట్ స్థానాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని ప్రకటించారు. ఈ యాత్రలో భాగంగా పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రముఖులను కలుసుకునే అవకాశం ఉందని, పలు దేవాలయాలతో పాటు, కార్యకర్తలతో సమావేశాలు కూడా ఉంటాయని వివరించారు. 2024లో జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి వచ్చే దిశగా తమ రాజకీయ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో వీర్రాజు మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు రాబోయే రోజుల్లో 13వేల గ్రామాల్లో పాదయాత్రలు చేపడతామన్నారు. సమస్యల ఆధారిత యాత్ర, ప్రభుత్వ వ్యతిరేక యాత్రగా ఇది ఉండబోతోందన్నారు. జనవరి చివరి వారంలో ఈ యాత్ర మొదలవుతుందన్నారు
వెనుకబడినవర్గాలను ఈ ప్రభుత్వం కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తోందని సోము ఆరోపించారు. ఎన్నికల ముందు జగన్ ఏలూరులో బిసి గర్జన నిర్వహించి ఎన్నో హామీలు ఇచ్చారని, వీటిని గుర్తు చేసేందుకే ఏలూరులో తాము ఇటీవల బిసి సభ నిర్వహించామని వీర్రాజు అన్నారు. విశాఖ, విజయవాడ, కర్నూలు లో కూడా బిసి సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జన పోరు పేరుతో 174 నియోజకవర్గాల్లో 6750 సమావేశాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
యువత ఎదుర్కొంటున్న సమస్యలపై బిజెపి యువమోర్చా రాష్ట్రంలోని నాలుగు జోన్లలో 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు పాదయాత్ర చేసిందని, దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందనితెలిపారు. ఎస్సీ మోర్చా బస్తీ సంపర్క్ అభియాన్ చేపట్టిందని అన్నారు. 172 అసెంబ్లీల్లో 10 వేల కిలోమీటర్ల పాటు 6,790 బస్తీల్లో ఈ కార్యక్రమం చేపట్టామని, పులివెందుల నియోజక వర్గంలో కూడా మంచి స్పందన వచ్చిందని వివరించారు. ఎస్సీలకు ఈ ప్రభుత్వం నిలిపివేసిన పథకాలపై వివరించామన్నారు.