Sunday, January 19, 2025
HomeTrending Newsబడ్జెట్‌లో సకలజనుల సంక్షేమం : మంత్రి హరీశ్‌రావు

బడ్జెట్‌లో సకలజనుల సంక్షేమం : మంత్రి హరీశ్‌రావు

సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం, సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా.. ప్రతిపక్ష సభ్యుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంది. కంటివెలుగు, రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వం మంచిపని చేసిందని ఒక్క మాటచెప్పలేదు. వారి మాటలు ఎలా ఉన్నాయంటే.. ‘నిండుపున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి.. ఆ చందమామ మీద ఉన్న మచ్చలు వెతికే ప్రయత్నం చేసినట్టుంది’. వెనుకటికి ఏం వంక అంటే.. ఏలువంక అన్న చందంగా బీజేపీ, కాంగ్రెస్‌ తీరుంది. బడ్జెట్‌లో సింహభాగం నిధులు పేదలు, బడు బలహీన వర్గాల కోసం నిధులు కేటాయించాం. ప్రతిపక్షాల మాటలు బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, అగ్రవర్ణాల పేదలకు ఏమి చేయొద్దని కాంగ్రెస్‌, బీజేపీ సభ్యుల మాటల్లో తెలుస్తుంది’ అన్నారు.

ముసలవ్వలకు రక్షణ.. పసిపిల్లలకు పోషణ
‘సీఎం కేసీఆర్‌ నాయకత్వం సూచనల మేరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ముసలవ్వలకు రక్షణ ఉంది. పసిపిల్లలకు పోషణ, బడి పిల్లలకు శిక్షణ, ఉన్నత విద్యకు ఉపకారం, యువత ఉద్యోగ కల్పన, ఆరిపోని కరెంటు వెలుగులు ఉన్నాయి. నదీ జలాలను ఎత్తిపోసే విజయాలున్నాయి. మత్తడి దుంకుతున్న చెరువుల తళతళలు, చెరువులో చేపపిల్లల మిలమిలలు, జలరాశుల గలగలలు, ధాన్యరాశుల కళకళలున్నాయి. రైతుల ముఖంపై విరబూస్తున్న చిరునవ్వులు, గొర్రెల మందల అరుపుల, గొళ్లకురుమల కండ్లలో మెరుపులు, నేతన్నకు భరోసా ఉన్నది, గీతన్నకు కులాస ఉన్నది. దళితబంధు ఇచ్చే దిలాసా, ఆకుపచ్చని అడవులు, మళ్లీ ఊపిరిపోసుకున్న పక్షి జాతులున్నాయ్‌, కాలుష్యంపై కదనం ఉంది.. పర్యావరణ సమతుల్యం ఉన్నది.. పేదిండి ఆడపిల్లల పెళ్లిపందిళ్లున్నాయి.. వారి తల్లిదండ్రుల కండ్లల్లో ఆనంద భాష్పాలున్నాయి. కంటి వెలుగు కాంతి ఉంది. కొత్త హాస్పిటల్స్‌ ఉన్నాయి.. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉంది. పెరిగిన బెడ్లు ఉన్నయ్‌.. చికిత్స మార్గం ఉంది.. ఆరోగ్య భాగ్యం.. సబ్బండ వర్ణాల సంక్షేమం ఉంది. సకలజనుల సౌభాగ్యం, సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉంది. ఇవి ప్రతిపక్షాలకు కనపడకపోతే మేం ఏం చేయాలి’ అన్నారు.

గతంలో సమావేశాలంటే ఖాళీ బిందెల ప్రదర్శనే..
‘గతంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే ట్యాంక్‌ బండ్‌ దగ్గర అంబేద్కర్‌ విగ్రహం నుంచే.. తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచో ఖాళీ బిందెల ప్రదర్శనలతో అసెంబ్లీకి వచ్చేవాళ్లం. అసెంబ్లీలో మొదటిరోజు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి మీద విపక్షాలన్నీ వాయిదా తీర్మానం ఇచ్చేవి. మిషన్‌ భగీరథ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రోజైనా భట్టీ విక్రమార్క గానీ, ఇతర విపక్ష సభ్యులు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీర్మానాలు ఇచ్చారా? వాగ్యుద్ధాలు ఉన్నాయా? ఖాళీ కుండల ప్రదర్శన ఉందా? ఇవన్నీ లేవంటే ప్రతిపక్షాలు కూడా రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదని ఒప్పుకున్నట్టే కదా? ఇంత మంచి పని జరిగితే ఒక్కనాడైన మంచి అని చెబుతున్నారా? అంటూ ధ్వజమెత్తారు.

మాకు సుద్దులు, బుద్ధులు చెబుతున్నరు..
‘గతంలో ఎమ్మెల్యేలుగా శాసనసభ నియోజకవర్గంలో పర్యటించాలంటే కాంగ్రెస్‌ మంత్రులు, పార్టీ నేతలు గ్రామాలకు రావాలంటే అయితే ముందే పోలీస్‌ బండన్నా రావాలే.. లేదంటే బోరుబండి వచ్చినంక ఎమ్మెల్యేనో.. మంత్రి వస్తుండే. పోలీసు బండి ఖాళీ బిందెలన్నీ పక్కకు జరిపితే మెల్లగా మంత్రిగారు వస్తుండే. లేదంటే బోరుబండి వచ్చి ఒకటో రెండు బోర్లు వేస్తే పెద్దగాల ఎమ్మెల్యేనో, మంత్రి వస్తుండే. ఇవాళ ఖాళీ బిందెల ప్రదర్శన ఉందా? ఆ రోజుల్లో బిందెడు నీళ్ల కోసం మైళ్లదూరం నడిపోయిన యాతన ఉండేది. అక్కాచెళ్లెళ్లు బోరింగ్‌లు కొట్టీకొట్టి భుజాలు నొప్పి పెట్టిన రోజులుండేవి. నారాయణఖేడ్‌లో ‘హదునూరకు ఎద్దునివ్వదు.. బోరంచకు పిల్లనివ్వద్దు’ సామెత ఉండేది. హద్దునూరకు ఎద్దునిస్తే నీళ్ల దొరక్క ఆగమైతదని.. ఎద్దనీవ్వద్దని అందురు. బోరంచలో నీళ్లు కావాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో పోయి బిందెల్లో మోసుకువచ్చే పరిస్థితి ఉండేది. గతంలో నులకమంచంలో పసిపిల్లలను నిలబెట్టి స్నానం చేయించి.. మంచం కింద తాంబాలం పెట్టి తిరిగి వాడుకునే దుస్థితి నాడు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండేది. ఇవాళ వీళ్లంతా మాకు సుద్దులు, బుద్ధులు చెబుతున్నరు’ అంటూ హరీశ్‌రావు విమర్శించారు

Also Read : 2023-24కి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్