తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు, ఈ ఘటనలో బాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు బాబు గడ్డానికి గాయమైంది. ఆయనకు వెంటనే కాన్వాయ్ లో ఉన్న ఒక వాహనంలో ప్రథమ చికిత్స చేశారు. బాడుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా నందిగామ గాంధీ సెంటర్ కు చేరుకున్న బాబు… వాహనం పైనుంచి ప్రసంగం మొదలు పెట్టారు. ఇదే సమయంలో విద్యుత్ పోయింది. కావాలనే విద్యుత్ కట్ చేశారని టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒక రాయి బాబు కాన్వాయ్ పై అయన సిఎస్వో మధుబాబుకు తగిలింది. బాబు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందని, త్రుటిలో prఅమాదం తప్పిపోయిందని టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చంద్రబాబు పర్యటనకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేక విద్యుత్ తేసేయించి రాళ్ళ దాడి చేయించారని టిడిపి నేతలు ఆరోపించారు.
ఈ ఘటనపై బాబు తీవ్రంగా స్పందించారు. పులివెందుల మార్క్ రాజకీయాన్ని రాష్ట్రంలో అంతటా చూపిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు, సిఎం జగన్ పిల్ల చేష్టలు చేస్తున్నారని, వారి గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. పోలీసులు తమ మంచితనాన్ని అసమర్ధతగా తీసుకోవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే తాము సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.