క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జూన్ 23 నుంచి ‘జగనన్న సురక్ష’ పథకం చేపట్టాలని ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నెలరోజులపాటు నిత్యం ప్రజల్లోనే ఉండాలని, ఇంటింటికీ వెళ్ళాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయంలో జగనన్న సురక్ష, గడపగడపకూ మన ప్రభుత్వంపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 87 శాతం కుటుంబాలకు మేలు జరిగిందని, ఈ మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటే తప్పకుండా విజయం సాధ్యమని, 175కు 175సీట్లు గెలవడమే లక్ష్యమని జగన్ పునరుద్ఘాటించారు. జగనన్నకు చెబుదాం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు కొనగాగుతాయని తెలిపారు. 18మంది ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం సరిగా నిర్వహించలేదని, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెళ్లలేదని, ఇప్పుడు వారు ఇప్పటినుంచి అయినా బాగా తిరగాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంపై సర్వే చేసినప్పుడు ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగుండాలని, అలా జరగకపోతే మార్చక తప్పని పరిస్థితి ఉంటుందని, అలాంటి వారిని కొనసాగిస్తే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని అన్నారు.
- సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జగనన్నకు చెబుదాం నిర్వహిస్తున్నాం, దీనికి అనుబంధంగా జగనన్న సురక్షా చేపడుతున్నాం
- సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళతారు
- మండల స్థాయిలో అధికారులు ప్రతి సచివాలయంలో ఒకరోజు పాటు గడుపుతారు
- గడప గడపకూ కార్యక్రమాన్ని కొనసాగించాలి, ప్రజలకు చేరువగా ఉండేందుకు ఉపయోగపడుతుంది
- వచ్చే 9నెలలూ కీలకం
- గతంలో ఎన్నడూ జరగని విధంగా నాలుగేల్లలోనే రాష్ట్రంలో మార్పులు తీసుకొచ్చాం
- ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ తెలియజేయాలి.
- నెగెటివ్ మీడియా ద్వారా మారీచుల్లా మనపై యుద్ధం చేస్తున్నారు
- ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టివి 5 నెగెటివ్ రిపోర్ట్ లపై ఫ్యాక్ట్ చెక్ ఇస్తున్నాం
- సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకొని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
- అబద్ధాలు, విష ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలి
- పనితీరు బాగా లేక టిక్కెట్లు రాకపోతే నన్ను బాద్యుడిని చేయవద్దు
- గత ప్రభుత్వ పాలన- మన హయంలో జరిగిన కార్యక్రమాలను నాడు-నేడు ద్వారా వివరించాలి
అంటూ నేతలకు ఉద్భోద చేశారు.