పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, దేశంతో పోటీపడే విధంగా వారిని తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే అమ్మఒడి పథకం తీసుకు వచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఓ మంచి ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చి తలరాతలు మార్చే ప్రయత్నం చేస్తుంటే గిట్టని వారు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘అమ్మఒడి అనే పథకాన్ని హేళన చేస్తూ… జగన్ అక్కచెల్లెమ్మలకు డబ్బులు ఉదారంగా ఇచ్చేస్తున్నాడు అంటున్నారు. జగన్ మాదిరి పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అని వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు’ అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
జగనన్న విద్యా దీవెన. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏప్రిల్ – జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు 694 కోట్ల రూపాయలను బాపట్లలో జరిగిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి సిఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో “రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ ప్రతి కుటుంబ సభ్యుడికీ నిండు మనస్సుతో రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన సిఎం జగన్… విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.
మన పిల్లల చదువులతోనే ఇంటింటా వెలుగులు నింపాలన్న మంచి సంకల్పంతో విద్యారంగంలోనే గొప్ప మార్పులు తీసుకువచ్చామన్నారు. జగనన్న అమ్మఒడి, వైయస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, మన బడి నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, బైజూస్‌తో ఒప్పందం లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా కరిక్యులమ్‌లో కూడా మార్పులు చేశామని చెప్పారు. కొత్త కరిక్యులమ్‌లో 30–40 శాతం స్కిల్ ఓరియెంటెడ్‌గా, జాబ్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని చెప్పారు.
డిగ్రీ చదువుతున్న విద్యార్ధులందరికీ పదినెలలపాటు కంపల్సరీ ఇంటర్న్‌షిప్ తీసుకొచ్చామని, ఆన్‌లైన్‌లో రకరకాల వర్టికల్స్ తీసుకొచ్చామని, మైక్రో సాప్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని 1.60 లక్షల మందికి శిక్షణతో పాటు సర్టిఫికేట్స్ కూడా ఇప్పించామని వివరించారు. రాబోయే తరంలో కాలేజీలు అవ్వగానే ఉద్యోగాలు సులభంగా వచ్చే విధంగా కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చామని, విద్యారంగంలో తీసుకున్న ప్రతి మార్పు వెనుక, అందుకోసం చేస్తున్న వేల కోట్ల రూపాయల ఖర్చు వెనుక…మన పిల్లల భవిష్యత్ కోసం మనందరి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప బాధ్యత కనిపిస్తుందని చెప్పారు.
మూడు సంవత్సరాల కాలంలో ఒక్క విద్యారంగంపై మాత్రమే.. రూ.53 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒక్క జగనన్న అమ్మఒడి పథకానికే రూ.19,618 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వేశామన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కోసం రూ.11,715 కోట్లు, గోరుముద్దకు రూ.3,117 కోట్లు, జగనన్న విద్యా కానుకకు రూ. 2324 కోట్లు, వైయస్సార్ సంపూర్ణ పోషణంకు రూ.4895 కోట్లు ఖర్చు చేశాం అని గణాంకాలు వివరించారు. రూ.11,669 కోట్లు మన బడి నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేస్తున్నామని, ఇవన్నీ కలిపితే రూ.53,338 కోట్లు ఒక్క విద్యారంగంపై ఖర్చు చేస్తున్నామని జగన్ వివరించారు.
Also Read : నేడు మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం