రాష్ట్రంలో పారదర్శకంగా… వివక్షకు, అవినీతికి తావులేని పరిపాలన సాగిస్తున్నామని గతంలో ఏ రోజూ ఇలా పథకాలు సామాన్యుడి చేరలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగుతుందని, లంచాలకు ఆస్కారం లేకుండా పాలన సాగుతోందని చెప్పారు. నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు. పాల్గొన్న ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేతలకు దిశానిర్దేశం చేశారు.వ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన మంచిని గణాంకాలతో వివరించారు. విశాఖపట్నం రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరమని, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 76 శాతం ఇళ్లల్లో మన పథకాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే దాదాపు 80 వేల ఇళ్లకు పథకాలు అందాయన్నారు. అధికారంలో ఉంటేనే నలుగురికి మంచి చేయగలుగుతామని, మనం ఉన్నాం కాబట్టే వ్యవస్ధలో గొప్ప మార్పులు జరుగు తున్నాయని, ఇవి కొనసాగాలంటే మనందరం కలిసికట్టుగా అడుగులు వేయాలని సూచించారు.
‘వారానికి కనీసం రెండు నియోజకవర్గాల్లో కేడర్‌ని పిలిచి వారితో మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరితో కనీసం ఒకట్రెండు నిమిషాలు మాట్లాడుతున్నాం. వాళ్ల భావాలను కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, వాటికి సన్నద్ధం కావల్సి ఉందని…. ఇంకా చాలా సమయం ఉంది కదా అనే అలసత్వం వద్దని హితబోధ చేశారు.
“సచివాలయాలనే గొప్ప వ్యవస్ధను తీసుకునిరాగలిగాం. వాటితో పాటు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతం పై చిలుకు హామీలను నెరవేర్చాం. అలా నెరవేర్చిన తర్వాత ప్రజలకు దగ్గరకు వెళ్లి వాళ్ల ఆశీస్సులు కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 కు 175 నియోజకవర్గాలు ఎందుకు రాకూడదు అన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. ఈ పరిస్థితిలు గుర్తుచేయడానికే ఈ సమావేశం” అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో విశాఖ వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.