రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు విశాఖ నగరం ముస్తాబైంది. రేపటినుంచి రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సిఎంకు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సిఎం జగన్ మూడ్రోజులపాటు ఇక్కడ ఉండనున్నారు.
పునరుత్పాదక విద్యుత్, ఐటి, మౌలిక సదుపాయాల రంగాల్లో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహకాలు, సముద్ర తీర ప్రాంతం, సహజ వనరులు, మానవ వనరులతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందని వారికి వివరించి పెట్టుబడులు ఆకర్షించడమే ధ్యేయంగా ఈ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, గుడివాడ అమర్నాథ్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజని, ఎపీలు విజయసాయి రెడ్డి,ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్లు, పరిశ్రమల శాఖా అధికారులు సిఎంకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.