Sunday, January 19, 2025
HomeTrending NewsKharma-Counter: అధికార భగ్న ప్రేమికుడు బాబు: జగన్  

Kharma-Counter: అధికార భగ్న ప్రేమికుడు బాబు: జగన్  

Jagan at Narsapuram: గతంలో బాబు చేసిన పాలన వల్లే  రాష్ట్ర ప్రజలంతా ఇదేం ఖర్మరా బాబూ అనుకొని గత ఎన్నికల్లో సొంత పుత్రుడిని, దత్తపుత్రుడిని అన్ని చోట్లా ఓడగొట్టి బై బై చెప్పారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కొత్త కార్యక్రమం ‘ఇదేం ఖర్మ’పై జగన్ వ్యంగ్యాస్త్రం సంధించారు.  ఇంటింటికీ అభివృద్ధి, మనిషి మనిషికీ అభివృద్ధి నినాదంతో తాము పని చేస్తున్నామని, తాము చేసిన చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక ప్రాంతాలు, వర్గాలూ ఓటు వేసి ప్రతి ఉపన్నికల్లో,  స్థానిక ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారన్నారు. చివరకు కుప్పంలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా టిడిపిని చిత్తుగా ఓడించి మరో సారి బై బై బాబు అని చెప్పారని గుర్తుచేశారు. అందుకే చంద్రబాబు ‘ఇదేం ఖర్మరా బాబు’ అని తల పట్టుకుని తాను కూర్చుంటే… ఆయన పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరూ కూడా ‘ఇదేం ఖర్మరా బాబూ’ అంటున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోపలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన సిఎం జగన్… ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ టిడిపి, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు తన 45  ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా , గత పాలకుల ఊహకు అందని విధంగా తాము అన్ని వర్గాలసంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పారు.  తన పాలనలో కనీసం కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని బాబు, ఆయన దత్త పుత్రుడు కలిసి  ఇది చేశామని చెప్పలేక, తాము చెప్పుకోదగినది ఏదీ లేక, తమ నోటికి ఎక్కువ పనిచేబుతున్నారని దుయ్యబట్టారు. టిడిపిని తెలుగు బూతుల పార్టీగా మార్చారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేన గా మార్చారని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, పార్టీలో, కేబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబూ అనుకుని ఉంటారన్నారు. ఇలాంటి నేతలు రాజకీయాల్లో ఉండడం ‘ఇదేం ఖర్మరా బాబు’ అని ప్రజలు కూడా అనుకుంటున్నారన్నారు.

ఇవే తనకు చివరి ఎన్నికలంటూ బాబు ప్రజలను బెదిరిస్తున్నారని, చివరకు కుప్పంలో కూడా గెలవలేనన్న నిరాశా, నిస్పృహలు బాబు ప్రతి మాటలో కనిపిస్తున్నాయన్నారు. ఇలాంటి మనుషులను, వారి ప్రవర్తనను చూసినప్పుడు సెల్ ఫోన్ టవర్లు ఎక్కి, రైల్ కింద తల పెట్టి,  పురుగుల మందు  డబ్బా పట్టుకొని బెదిరించే వారు గుర్తుకు వస్తున్నారని…. ఇదే టైపులో అధికార భగ్న ప్రేమికుడు బాబు ప్రజలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

ఏ మంచీ చేయని తనకు ఎవరైనా ఎందుకు వోటు వేస్తారనికానీ, ఎందుకు వేయాలన్నది కానీ బాబు, దత్తపుత్రుడూ  చెప్పబోరని, ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి అని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా చూడాలని, మంచి జరిగి ఉంటె మీ బిడ్డకు, అన్నకు తోడుగా నిలబడాలని సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్