Sunday, January 19, 2025
HomeTrending Newsకొబ్బరండోయ్ కొబ్బరి

కొబ్బరండోయ్ కొబ్బరి

Coconut :  కొబ్బరి అనేది శ్రీలంక, భారతదేశం వంటి ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే చెట్టు. కొబ్బరి చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి. కొబ్బరికాయ దక్షిణ భారత వంటలలో ప్రముఖ పాత్ర పోషి స్తుంది.

ఒక కొబ్బరి చెట్టు 60 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీనికి కొమ్మలుండవు. పై భాగాన ఆకులుంటాయి. ఒక్కో ఆకు 4 – 6 మీటర్ల పొడవు ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాలలో పొట్టి కొబ్బరి చెట్లుకూడా ఉంటాయి. పొట్టి రకం కొబ్బరి చెట్ల జీవితకాలం 30 – 40 సంవత్సరాలు. ఇవి 3 – 4 సంవత్సరాలలో కాయలిస్తాయి. ఇందులో గంగా బంధన్, చౌగడ్ ఆరెంజ్, చౌగడ్ గ్రీన్, మలయన్ గ్రీన్, మలయన్ ఎల్లో వంటి రకాలు ఉన్నాయి. నీరు కూడా ఎక్కువ ఉంటుంది.

మన దేశంలోని అనేక ప్రాంతాలలో వివాహం, గృహ ప్రవేశం, హోమాలు, యజ్ఞాలు, పూజలు, పేరంటాలు లాంటి అనేక శుభకార్యక్రమాలలో కొబ్బరికాయకు ప్రముఖ స్థానం ఇస్తారు.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం కేరళ కొబ్బరి ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉండగా ఆంధ్ర ప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం జిల్లాలు కొబ్బరి పంటకు ప్రసిద్ధం.

చైనా, అరేబియా, ఇటలీ యాత్రీకుల అనుభవాలలో కొబ్బరికాయ గురించి ప్రస్తావన ఉన్నట్లు అధ్యయనాల మాట. కొబ్బరి పంట ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ దీవులు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, కరీబియన్ దీవుల్లో, అమెరికాలోని దక్షిణ భాగంలోనూ కొబ్బరి బాగా పండుతుంది.

అయినప్పటికీ కొబ్బరి పుట్టినిల్లు భారతదేశమే కావడం విశేషం. కొబ్బరికి సంబంధించి కొన్ని విషయాలు….

కొబ్బరికాయకు పోర్చుగీస్ నావికులు పేరు పెట్టిన పేరు కోకో. అంటే “నవ్వుతున్న చూపు” అని అర్ధం. ఎందుకంటే కొబ్బరికాయలోని మూడు కళ్ళు నవ్వుతున్న ముఖంలా ఉన్నాయని వారి భావన.

కొబ్బరి చెట్టును చక్కగా చూసుకుంటే 80 సంవత్సరాల వరకు ఫలాలను ఇవ్వగలదు. ఓ చెట్టు నూరేళ్ళుంటుంది.

“అరేబియా రాత్రుల కథ” లో సిందుబాద్, తన ఐదవ సముద్రయానంలో కొబ్బరికాయలు అమ్మాడని ఉంది.

భారతదేశం వెలుపల, ఆస్ట్రేలియా, కొలంబియాలలో పురాతన కొబ్బరి చెట్ల ఆనవాళ్ళు లభించాయి.

మరుగుజ్జు రకాలతోసహా నూరు రకాల కొబ్బరి చెట్లు ఉన్నాయి.

మాల్దీవులలో కొబ్బరి జాతీయ వృక్షం.

కొబ్బరి చెట్టులో మగ, ఆడ పువ్వులుంటాయి. కానీ స్వీయపరాగ సంపర్కమనేది ఉండదు.

కొబ్బరి చెట్టుని వంతెనలు, ఇళ్ళు, పడవల నిర్మాణంలో ఉపయోగిస్తారు.

1970లలో, ఫిలిప్పీన్స్‌కు చెందిన జనరల్ మార్కోస్ కొబ్బరి కలపతో ఒక ప్యాలెస్‌నే నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు.

కొబ్బరి పువ్వురసంతో “కొబ్బరి వోడ్కా”ను తయారుచేయవచ్చు.

కొబ్బరికాయలోని మూడు “రంధ్రాలు” కొత్త చెట్టు చిగురుకు అంకురోత్పత్తి రంధ్రాలు.

కొన్ని దేశాల్లో శిక్షణ పొందిన కోతులను కొబ్బరికాయలు కోయడానికి ఉపయోగిస్తారు.

కొబ్బరి పొట్టును కాల్చి దోమల నివారణకు ఉపయోగిస్తారు.

కొబ్బరి పీచు పొట్టును చాపలు, తాళ్ళు, బ్రష్షులు, పరుపుల తయారీలో ఉపయోగిస్తారు.

ఆస్ట్రేలియాలో ఒక నిర్దుష్ట జాతి ఆక్టోపస్ రక్షణ, ఆశ్రయం కోసం కొబ్బరిచిప్పను ఉపయోగిస్తుంది.

కొబ్బరి నీళ్లలో ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎంతో ప్రయోజనకరం.

పచ్చికొబ్బరి పోషకవిలువలున్న ఆహారం. ఇందులోని విటమిన్ బి, మాంగనీస్, ఐరన్, రాగి, పాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం.

కొబ్బరినీటిని మానవ రక్త ప్లాస్మాకు స్వల్పకాలిక ప్రత్యామ్నాయంగా ఉపయోగించిన సందర్భాలున్నాయి.

దక్షిణ పసిఫిక్‌లో కొన్ని తెగలవారు తమ రోజువారీ కేలరీలలో 60 శాతం కొబ్బరి నుండి తీసుకుంటారు మరియు అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారు మరియు గుండె జబ్బుల సంకేతాలను చూపించరు.

సోయాబీన్ నూనె వాడకానికి ముందర కొబ్బరి నూనెనే ప్రపంచంలోని ప్రముఖ కూరగాయల నూనెగా వినియోగించేవారు.

కొబ్బరి నీళ్లను కొబ్బరి వెనిగర్‌తో పులియబెట్టవచ్చు.

గాయకుడు, గేయరచయిత హ్యారీ నిల్సన్ రాసిన “కొబ్బరి” పాట ఎంతో ఆదరణ పొందింది.

సెప్టెంబర్ రెండో తేదీని ప్రపంచ నారికేళ దినోత్సవం జరుపుకోవడం అన్నది 2009లో మొదలైంది.

– యామిజాల జగదీశ్

Also Read : 

అరటిపండ్లకోసం ఓ క్లబ్బూ..! ఓ మ్యూజియమూ!!

RELATED ARTICLES

Most Popular

న్యూస్