నాని ఇంతకుముందు చాలా వైవిధ్యభరితమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. అయితే ఆయన కాస్త హెయిర్ స్టైల్ .. మీసకట్టు మాత్రమే మార్చుకుంటూ కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తూ వెళ్లాడు. కానీ ‘దసరా’ ఫస్టు పోస్టర్ చూసినప్పుడే, నాని ఈ తరహా లుక్ తో ఇంతవరకూ కనిపించలేదనే విషయం అభిమానులకు అర్థమైపోయింది. అంతేకాదు పదే పదే ఆయన ఉపయోగించే డైలాగ్ కూడా, ఆయన పాత్రను ఏ రేంజ్ లో డిజైన్ చేశారనేది చెబుతోంది.
నాని ఊర మాస్ లుక్ .. ఆయన మందు సీసాలు లుంగీలో దోపుకోవడం .. కల్లు తాగేసి అక్కడి జనాలతో స్టెప్పులు వేయటం .. ఈ సినిమాలో మాస్ అంశాలు ఏ స్థాయిలో ఉన్నయనేది చెబుతూ వచ్చాయి. అయితే రీసెంట్ గా వదిలిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే, ఇందులో హింస కూడా గతంలో నాని సినిమాలను మించి ఉందనే విషయం అర్థమవుతోంది. రక్తపాతం మోతాదుకు మించే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కనిపించేవి ఫైట్స్ అని చెప్పేలేం .. కొట్లాట అంటేనే కరెక్టుగా ఉంటుంది. సహజత్వం కోసమే అలాగే డిజైన్ చేశారు.
సినిమాల్లో గ్రామీణ నేపథ్యం .. ఎవడో వచ్చి పెత్తనం చెలాయించడానికి ట్రై చేయడం .. హింసతో హీరో వాడికి ఎదురెళ్లడం .. ఇలాంటివన్నీ సహజమే .. అయితే అవన్నీ నాని సినిమాలో ఉండటమే ఇక్కడి విశేషం. ఒక వ్యక్తిని కసితో .. పగతో హీరో పదే పదే పొడవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. మాస్ కంటెంట్ మోతాదు మించిందేమో అనిపిస్తుంది. అలా కాకుండా నానీకి ఉన్న ఇమేజ్ పరిథిలోనే ఈ కథను కట్టడిచేసినట్టయితే కొత్తదనం కోసం నాని చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు కూడా ఇది మాస్ ఆడియన్స్ జరుపుకునే ‘దసరా’నే అవుతుంది.