రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒడిశాకు వచ్చిన ద్రౌపది ముర్ము రెండు కిలోమీటర్లు నడిచి జగన్నాథుడిని దర్శించుకున్నారు. గురువారం పూరికి చేరుకున్న ఆమె తన కాన్వాయ్‌ను బాలాగండి ఛాక్ వద్ద నిలుపుదల చేశారు. ఆలయాన్ని చేరుకోవడానికి ఆమె గ్రాండ్ రోడ్‌లో దాదాపు కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లి చరిత్ర సృష్టించారు. సాధారణ భక్తురాలిగా నడిచి జగన్నాథుడిని దర్శించుకున్నారు.
తొలుత ఆలయ సింహద్వారం వద్ద మోకరిల్లిన ఆమె 34 అడుగుల పొడవైన అరుణ స్తంభాన్ని స్పృశించారు. రాష్ట్రపతికి పూరి రాజు గజపతి మహారాజ దివ్యసింగ్ దేవ్, ప్రధాన అర్చకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. గర్భాలయంలో దీపం వెలిగించి, సుమారు 15 నిమిషాల పాటు అక్కడే ధ్యానం చేశారు. తన కుమార్తె ఇతిశ్రీతో కలిసి జగన్నాథుడికి తులసి మాల సమర్పించారు.
జగన్నాథ స్వామి దర్శనం కోసం చాపర్ దిగిన ఆమె.. కాన్వాయ్ తో బయలుదేరకుండా.. అక్కడే ఆమె కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ నడుచుకుంటూ ముందుకువెళ్లటం… అలా ఏకంగా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆలయానికి వెళ్లిన వైనం అందరిని ఆకర్షించింది.