Sunday, January 19, 2025
HomeTrending Newsన్యూజిలాండ్ లో భూకంపం

న్యూజిలాండ్ లో భూకంపం

న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్‌ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం ఆ దేశాన్ని తట్టింది. బుధవారం వెల్లింగ్‌టన్‌లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పరపరము (Paraparaumu) పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో.. 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపారు. భూకంపం ధాటికి వెల్లింగ్‌టన్‌లో కొన్ని సెకన్లపాటు బలమైన వణుకులు సంభవించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు న్యూజిలాండ్‌ను గత కొన్నిరోజులుగా గాబ్రియెల్ తుఫాను వణికిస్తోంది. నార్త్‌ ఐలాండ్‌, ఆక్లాండ్‌లో గాబ్రియెల్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వేలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రికార్డుస్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉధృతికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్