దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్ లెవెల్ స్థాయికి చేరాయి. పలు రాష్ట్రాల్లో డ్యాంల వద్ద ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. యమున నదిలో వరద డేంజెర్ లెవెల్ కు చేరుకుంది. 204.5 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్ లోని యమున పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మథురలో యమున నది తీరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీవర్షాలతో నర్మద నది పొంగి ప్రవహిస్తోంది. నర్మదాపురం జిల్లాలోని ప్రజలు వరదనీటి ప్రవాహంతో నానా అవస్థలు పడుతున్నారు. నర్మదా నదిలో వరద నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. నర్మదా నది వరదనీటి ప్రవాహంతో నదీ తీర ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు సైతం వరదనీటితో నిండాయి.కర్ణాటక, చత్తీస్ ఘడ్, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు.
ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల మహానది పొంగి ప్రవహిస్తోంది. అల్పపీడనం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదనీరు ప్రవహిస్తుండటంతో 10 జిల్లాల్లో 2 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. కటక్, జగత్ సింగ్ పూర్, పూరి, కేంద్రపాడ, ఖుర్దా, సంభల్పూర్ జిల్లాల్లో భారీ వర్షాలతో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భద్రక్ జిల్లాలో వరదనీటితో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వరద ప్రాంతాల ప్రజలను పడవలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాలాసోర్ జిల్లాలో వైతరణి (బైతారణి) నది వరదనీటి ప్రవాహంతో భద్రక్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
వర్షాలు, వరద పరిస్థితిపై ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆహార సామాగ్రి అందించి పునరావాసం కల్పిస్తున్నారు. రేపు,ఎల్లుండి మరింత భారీ వర్షాలు ఉన్నాయని ఒరిస్సా , జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.