రహదారులపై ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు రహదారులపై వాహనదారులు ప్రయాణించినంత దూరానికే చార్జీ వసూలు చేయాలన్న లక్ష్యంతో రానున్న ఆరు నెలల్లో వీటిని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగిస్తూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌హెచ్‌ఏఐకి ప్రస్తుతం టోల్ చార్జీల రూపంలో ఏటా రూ.40 వేల కోట్ల వరకు ఆదాయం వస్తున్నదని, వచ్చే 2-3 ఏండ్లలో ఇది రూ.1.40 లక్షలకు పెరగవచ్చని తెలిపారు. రహదారులపై వాహనాలను ఆపకుండానే ఆటోమేటిక్‌గా నంబర్ ప్లేట్లను గుర్తించేందుకు రవాణా శాఖ ఓ పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నది. 2018-19లో టోల్ ప్లాజాల వద్ద వాహనాల సగటు వెయిటింగ్ టైమ్ 8 నిమిషాల వరకు ఉండేది. 2020-21, 2021-22లో ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టడంతో ఈ సమయం 47 సెకన్లకు తగ్గింది. కానీ, జనసమ్మర్ధం అధికంగా ఉన్న పట్టణాల్లోని టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికీ పీక్ అవర్స్‌లో వాహనాలు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తున్నది.