తెలంగాణలో ఈ రోజు చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉదయం ఎండ కాసినా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావారణం మబ్బులు కమ్ముకుంది. సంగారెడ్డి,జహీరాబాద్ , వికారాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన పడుతోంది. వర్షానికి తోడు వడగళ్లు కూడా పడటంతో రోడ్లపై మంచులా పరుచుకుంది. దీంతో ప్రజలు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరోవైపు ఈ వర్షాలు మామిడితోపాటు వరి పంటకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తుండగా చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చీకటి అలుముకుంది.
గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, పిడుగులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ ఇలా అన్ని చోట్లా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. రేపు, ఎల్లుండి కూడా వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉంది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్‌ను బట్టి అంచనా వేస్తున్నారు. ద్రోణి ప్రభావం కారణంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది. మరో మూడు రోజులపాటు తెలంగాణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.