Monday, January 20, 2025
HomeTrending NewsShamshabad:అక్రమార్కులపై హెచ్ఎండిఏ ఉక్కుపాదం

Shamshabad:అక్రమార్కులపై హెచ్ఎండిఏ ఉక్కుపాదం

హైదరాబాద్ నగర శివార్లలో తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన అక్రమార్కులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) గట్టి గుణపాఠం చెప్పింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నిస్తున్నారు. సంబంధంలేని సర్వే నెంబర్ల ను బూచిగా చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు.

హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సహకారంతో ఆపరేషన్ శంషాబాద్ విజయవంతం చేశారు. ఈ ఆపరేషన్ లో దాదాపు వంద (100) మంది పాల్గొన్నారు. హెచ్ఎండిఏ ఎస్టేట్ అధికారులు, సిబ్బంది 15 మంది, హెచ్ఎండిఏ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, సిబ్బంది 50 మంది, సైబరాబాద్ పోలీస్ అధికారులు సిబ్బంది 20 మంది పాల్గొన్నారు.

పక్కా ప్రణాళికతో సోమవారం రాత్రి శంషాబాద్ ప్రాంతానికి చేరుకున్న హెచ్ఎండిఏ యంత్రాంగం రహదారులను బ్లాక్ చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఏకతాటిగా ఆక్రమణలను కూల్చివేశారు. వాస్తవానికి శంషాబాద్ లోని 181 ఎకరాల భూములను హెచ్ఎండిఏ 1990 సంవత్సరంలో ఆనాటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్వివైజేషన్ (LA) కింద హెచ్ఎండిఏ తీసుకుంది. శంషాబాద్ లోని ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కు సర్వహక్కులు ఉన్నాయి.

ఇక్కడి భూముల్లోని దాదాపు 20 ఎకరాల్లో హెచ్ఎండిఏ నర్సరీ పనిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏకు సంబంధించిన 181 ఎకరాల్లో రెండు(2) ఎకరాల భూమిని ఆ పరిసరాల ప్రజల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం హెచ్ఎండిఏ కు సంబంధించిన ఈ భూముల నుంచి ముప్పై(30) గుంటల భూమిని కేటాయించడం జరిగింది. ఆపరేషన్ శంషాబాద్ విజయవంతమైన తదుపరి హెచ్ఎండిఏ భూముల చుట్టూ బుధవారం నుంచి ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్