చట్టోగ్రామ్ టెస్టుపై ఇండియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేసిన ఇండియా బంగ్లాదేశ్ ను కట్టడి చేసింది. కుల్దీప్ యాదవ్, సిరాజ్ లు బంగ్లా బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయగలిగింది. ఇంకా 271 పరుగులు వెనకబడి ఉంది.
తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో నేటి రెండోరోజు ఆట మొదలు పెట్టింది. 82 పరుగులతో క్రీజులో ఉన్న శ్రేయాస్ అయ్యర్ (86) మరో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్- కుల్దీప్ యాదవ్ లు ఎనిమిదో వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ అర్ధ సెంచరీ పూర్తి చేసి 58వద్ద ఔట్ కాగా, కుల్దీప్ యాదవ్ 40 పరుగులు చేసి వెనుదిరిగాడు. సిరాజ్ ఒక ఫోర్ సాధించి చివరి వికెట్ గా ఔటయ్యాడు. దీనితో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో404 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
తైజుల్ ఇస్లామ్, హసన్ మిరాజ్ చెరో నాలుగు; ఎబాదత్ హుస్సేన్, ఖలేద్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇన్నింగ్స్ తొలి బంతికే నజ్ముల్ శాంటో వికెట్ ను బంగ్లాదేశ్ కోల్పోయింది. వన్ డౌన్ లో వచ్చిన యాసిర్ అలీ కూడా 4 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్-28; లిట్టన్ దాస్ -24; జాకీర్ హుస్సేన్ -20; నూరుల్ హాసన్-16; కెప్టెన్ షకీబ్ అల్ హసన్-3 పరుగులు చేసి ఔట్ కాగా తైజుల్ ఇస్లామ్ డకౌట్ అయ్యాడు. హాసన్ మిరాజ్-16; ఎబాదత్ హోస్సేన్ -13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కుల్దీప్ యాదవ్ నాలుగు; సిరాజ్ మూడు; ఉమేష్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.