భారత్ కు ఉన్న యువశక్తి 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా చేస్తుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజన్ తో సాగించే పరిపాలన, తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయన్నారు. నాడు విజన్ తో హైదరాబాద్ లోచేపట్టిన ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఇప్పుడు ఫలితాలను ఇస్తూ…ఉదాహరణగా నిలుస్తోన్నాయని తెలిపారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ (ISB) 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ISB ఆవిర్భావం, ప్రస్థానం, సాధించిన విజయాలు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ… “నాడు విజన్ రూపంలో మనం ఊహించింది అంతా ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. ISB ఏర్పాటైన ప్రాంతంలో నాడు ఎటువంటి అభివృద్ది లేదు…కేవలం హైదరాబాద్ యూనివర్సిటీ ఉండేది…అయితే తరవాత కాలంలో పెనుమార్పులు వచ్చాయి.
భవిష్యత్ లో ఐటికి ఉన్న ప్రాధాన్యం గుర్తించి మైక్రోసాఫ్ట్ ను తీసుకువచ్చాను. దీనికోసం 45 నిముషాలు పాటు బిల్ గేట్స్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. భారత దేశ బాలాబలాలు వివరించాను….సంస్థ ను ఏర్పాటు చేయాలని కోరాను. మైక్రోసాఫ్ వస్తే అన్ని కంపెనీలు వస్తాయి అని నా నమ్మకం. నా ప్రయత్నాల తరువాత అమెరికా వెలుపల తొలిసారి మైక్రోసాఫ్ కార్యాలయం పెట్టారు.అలా వచ్చిన మైక్రోసాఫ్ట్ సంస్థకు నేడు ఒక ఇండియన్ సిఈవో గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ రావడంతో ఇతర సంస్థలు కూడా హైదరాబాద్ కు వచ్చాయి. ISB ను హైదరాబాద్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాము. సంస్థ ఏర్పాటుపై చర్చలు, ప్రతిపాదనల సమయంలో ISB ప్రతినిధులను ఆహ్వానించి గౌరవించాను. స్వయంగా బ్రేక్ ఫాస్ట్ వడ్డించాను. అతిథి మర్యాదలతో ISB ప్రతినిధులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాను. హైదరాబాద్ కు ఉన్న వసతులు, ప్రభుత్వ పరంగా తాము ఇచ్చే మద్దతుపై వివరించాను. ఇతర రాష్ట్రాలు కూడా పోటీపడినా నాడు చాణక్యంతో ISB ఇక్కడికి తీసుకువచ్చాను. హైదరాబాద్ ఫ్యూచర్ నాలెడ్జ్ హబ్ అని నాడు ప్రజెంటేషన్ ఇచ్చాను.
జనాభా నిష్ఫత్తి అనేది భారత దేశానికి ఉన్న బలం. దేశంలో యువ శక్తి ఎక్కువ ఉంది. ఇది ఎంతో సానుకూలం అంశం. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలకంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. దేశంలో యువశక్తి కొనసాగేలా ప్లాన్ చేసుకుంటే 2047కు ప్రపంచ అగ్రగామిగా భారత్ అవతరిస్తుంది. దీన్ని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. 25 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐటి కారణంగా లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం పొందే వారు భారతీయులే. అమెరికన్ ల తలసరి ఆదాయం కంటే అక్కడ ఉన్న భారతీయుల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ప్రపంచంలో పబ్లిక్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ లో మేటిగా భారతీయులు స్థానం పొందుతున్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు గుర్తుపెట్టుకోండి…..2047కు దేశం అద్భుత విజయాలు సాధిస్తుంది. విభజన తరువాత ఎపి కోసం విజన్ 2029 సిద్దం చేశాను. తెలంగాణకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు అనుకూలంగా మారితే…ఎపికి ఇరిగేషన్, కోస్టల్ ప్రాంతం అనుకూలంగా ఉన్నాయి.
ఇప్పుడు పాపులేషన్ గురించి కూడా దేశంలో చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలను కనాలి. లేకపోతే భవిష్యత్ లో జనాభా నిష్ఫత్తి సమస్య వస్తుంది. భారతదేశం వచ్చే కాలానికి జనాభా నిష్ఫత్తికి అనుగుణంగా అడుగులువెయ్యాలి. ఐఎస్బి మరెన్నో విజయాలు సాధించాలి. సంస్థను ఈ స్థాయికి తెచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు” అని చంద్రబాబు నాయుడు అన్నారు.