Sunday, January 19, 2025
HomeTrending NewsMossaad : ఇజ్రాయల్ నిఘా సంస్థలకు మాయని మచ్చ

Mossaad : ఇజ్రాయల్ నిఘా సంస్థలకు మాయని మచ్చ

ఇజ్రాయల్ ప్రతిభ పాటవాలపై ఇన్నాళ్ళు ప్రపంచం గొప్పగా చెప్పుకునేది. హమాస్ దాడితో అక్కడ నిఘా వర్గాలు, దేశ భద్రత ఎంత డోల్లగా ఉందొ బయట పడింది. దుస్సాహస లక్ష్యాలను చేదించటం మోస్సాద్ కు వెన్నతో పెట్టిన విద్య. శత్రువు ఖండాంతరాల్లో ఉన్నా.. మూడో కంటికి తెలియకుండా తుదముట్టించి రావటంలో మొస్సాద్ ఆరితేరింది.

మెరికల్లాంటి గుడాచారులు ఉన్న మొస్సాద్ మొద్దు నిద్రలో ఉందా. శత్రువు కదలికలను భూతద్దంలో చూసే ఇజ్రాయల్ నిఘా వ్యవస్థ షిన్ బెట్… మితిమీరిన ఆత్మవిశ్వాసం కొంప ముంచిందా అనే విశ్లేషణలు జరుగుతున్నాయి.

మొసాద్‌, షిన్ బెట్ లో చేరడం అంత తేలికకాదు. శారీరక పరీక్షలతోపాటు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. భాషా నైపుణ్యాలను కూడా పరీక్షిస్తారు.

సాయుధులైన డజన్ల కొద్దీ హమాస్ ఉగ్రవాదులు.. పటిష్టమైన రక్షణ కంచెను బుల్డోజర్ లతో కూల్చేసి ఇజ్రాయెల్ లోకి ప్రవేశించటం ఒక ఎత్తయితే.. నిమిషాల వ్యవధిలో వేలాది రాకెట్లను ప్రయోగించటం.. కనిపించిన వారిని కనిపించినట్లుగా పిట్టల్లా కాల్చేసిన వైనం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

దాడులకు సంబంధించి సమాచారం ముందే ఉన్నప్పటికి అడ్డుకోలేకపోవటమే నిజమైతే… అంతకు మించిన దారుణ వైఫల్యం మరొకటి ఉండదు. నిధుల కొరత అన్నదే లేని ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ.. ఇంత భారీ దాడుల్ని ముందస్తుగా ఎందుకు గుర్తించలేకపోయిందన్నది ప్రశ్నగా మారింది.

ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఏజెంట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ల గ్రూపులతో పాటు లెబనాన్.. సిరియా తదితర మధ్య ప్రాచ్య దేశాల్లో వారి ఏజెంట్లు ఉన్నారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉందన్న పేరు ప్రఖ్యాతులున్నప్పటికి ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయన్నది చర్చనీయాంశంగా మారింది.

డ్రోన్లతో.. ఏజెంట్ల సాయంతో కార్లకు జీపీఎస్ పరికరాల్ని అమర్చి.. వాటిని ట్రాక్ చేసి దాడులు చేపట్టటం.. సెల్ ఫోన్ పేలుళ్లతోనూ దాడులకు పాల్పడే ఇజ్రాయల్ నిఘా వ్యవస్థకు ఏమైంది?

భారీ వైఫల్యం చోటు చేసుకున్నా… వారి శక్తి సామర్థ్యాలను ఎవరు తక్కువగా అంచనా వేయటం లేదు.  అంతర్గతంగా ఏమి జరిగి ఉంటుందనే కోణంలో రక్షణ రంగ నిపుణులు కూడా స్పష్టత ఇవ్వటం లేదు. వందల మంది దేశ ప్రజల ప్రాణాలు పోవటానికి మొస్సాద్, షిన్ బెట్ లే కారణం….భవిష్యత్తులో శత్రువు మీద పైచేయి సాధించినా… రెండు సంస్థలకు ఎప్పటికీ ఈ దుర్ఘటన  మాయని మచ్చగానే బిగులుతుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్