Sunday, January 19, 2025
HomeTrending Newsనాకు ‘కాపు’ కాయండి: పవన్ విజ్ఞప్తి

నాకు ‘కాపు’ కాయండి: పవన్ విజ్ఞప్తి

తమను 175 సీట్లలో పోటీ చేయాలనే హక్కు వారికి ఎక్కడిదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ప్రశ్నించారు. దమ్ము, మగతనం అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు వారు మాట్లాడుతున్న ప్రతి మాటకూ శిస్తు కట్టిస్తామని హెచ్చరించారు. దుర్యోధనుడు తొడలు కొట్టాడని, ఆ రెండు తొడలను భీముడు పడగొట్టాడని గుర్తు చేశారు. కాపు నేతలు తనను తిడతారని, కానీ వారు తనకు ఎందుకు అండగా నిలబడలేకపోయారని నిలదీశారు. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పిన వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించారని, కానీ తనను రెండు చోట్లా ఓడించారని నిర్వేదం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు, బలిజలు, ఒంటరి కులాలు తనకు సంపూర్ణంగా అండగా నిలిస్తే గెలుపు సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. కులాల చట్రంలో ఇరుక్కుపోవద్దని విజ్ఞప్తి చేశారు.  క్షేత్ర స్థాయిలో నివేదికలు, సర్వేల ఆధారంగా గెలుపు సాధ్యం అనుకున్నప్పుడు ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా వెనకాడబోనని తేల్చి చెప్పారు.

డబ్బులతో తనను ఎవరూ కొనలేరని, డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ సిఎం కేసిఆర్ తనకు వెయ్యికోట్లు ఇస్తున్నారంటూ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వెయ్యి కోట్లు దగ్గరే ఎందుకు ఆపారని పదివేల కోట్లు అంటే బాగుండేది కదా అంటూ వ్యంగ్యంగా అన్నారు. మచిలీపట్నంలో జరిగిన పార్టీ పదో ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగించారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు చూపించానని, ఆ చెప్పు తెనాలిలో తయారు చేసిందని వ్యాఖ్యానించారు. అలాగే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తే బాగోదని హెచ్చరించారు.  తాను సినిమా చేస్తే ఒక్కో రోజుకు 2 కోట్లరూపాయలు తీసుకుంటానని, అన్ని సినిమాలకూ ఇంత ఇవ్వకపోయినా.. ప్రస్తుతం తానూ ఈ పారితోషికం తీసుకుంటున్నానని, అంటే 20 రోజులు డేట్స్ ఇస్తే 40 కోట్లు వస్తాయని… అలాంటి తనకు ఏ ప్యాకేజీ అవసరం లేదని అన్నారు.

కులాల ప్రస్తావన ఎందుకని పవన్ ప్రశ్నిస్తూ వంగవీటి రంగా కాపులకు ఆరాధ్య దైవం అని, అయన పెళ్లి చేసుకుంది ఓ కమ్మ కులానికి చెందిన వ్యక్తినని, వారిద్దరికీ పుట్టిన వంగవీటి రాధా కు లేని కులం మనదరికీ ఎందుకని నిలదీశారు. తాను సమాజాన్ని విశాల దృష్టితో చూసే వ్యక్తినని తేల్చి చెప్పారు. కులం చూసి ఓటేసే పధ్ధతి మారాలని విజ్ఞప్తి చేశారు.

పవన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • ఒక్కడితో మొదలైన జనసేన ప్రస్థానం ఇప్పుడు లక్షలాది క్రియాశీల కార్యకర్తలను కలిగి ఉంది
  • పార్టీ నిలబెట్టడం చాలా కష్టం, అయినా ధైర్యంతో పోరాడుతున్నా
  • ధైర్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది, ఆ నమ్మకంతోనే పయనం కొనసాగించా
  • ఎవరైనా గెలిచినా కొద్దీ బలపడతారు, కానీ మన పార్టీ ప్రతి ఓటమితోనూ బలపడుతోంది
  • ప్రజల ఆశీస్సులతో ఏదోరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
  • ఒక కులాన్ని గద్దెనెక్కించేందుకు నేను లేను, కులాల మధ్య ఐక్యత అవసరం
  • వైసీపీ ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లు కొంగకు పాయసం పెట్టినట్లున్నాయి. పాయసం ఉంటుంది కానీ ఎప్పటికీ తినలేము
  • చాల మందిని కలుస్తున్నాను, రాష్ట్రంలో మార్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు
  • పాలనలో కుల పెత్తనం పోవాలి
  • రాష్ట్రంలో అన్ని కులాలకూ సమాన ప్రాతినిధ్యం ఉండాలంటే జనసేన ప్రభుత్వం రావాలి
  • అగ్రకులాల్లో వెనకబడిన యువతను కూడా ఆదుకుంటాం
  • బిజెపితో పొత్తు పెట్టుకుంటే తాము మీకు సహకరించాలేమని ముస్లిం ప్రతినిధులు నాతో అన్నారు
  • నేను బిజెపితో పొత్తులో ఉండగా మీపై ఏదైనా జరిగితే నాదే బాధ్యత… ముస్లింలు తనకు ఓటేయ్యాలి
  • మత సామరస్యాన్ని బలంగా కాపాడతాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్