చిన్నారులను విద్య వైపు ప్రోత్సహించే దిశగానే వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీతోఫా పథకాలకు వధూవరులు ఇద్దరికీ కచ్చితంగా పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకువస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనివల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా పదోతరగతి చదివించే అవకాశం ఉందని, పెళ్లినాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలన్నది రెండో నిబంధన అని వివరించారు.
వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాన్ని క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల, పేద అమ్మాయిల వివాహాలకు వైయస్సార్ కళ్యాణమస్తు…. ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైయస్సార్ షాదీ తోఫా గా నామకరణం చేశారు. ఈ పథకాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను సిఎం ఆవిష్కరించారు.
గత ప్రభుత్వంలో కూడా పెళ్లికానుక అని పథకాన్ని ప్రకటించి 2018లో ఆపేశారని సిఎం గుర్తు చేశారు. అప్పట్లో ఎవ్వరూ కూడా పిల్లలు చదవాలని తాపత్రయపడి పెట్టిన పథకం కాదని, కేవలం ఎన్నికలకు ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో పెట్టారని వ్యాఖ్యానించారు. 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్లు వివాహ ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారని విమర్శించారు. దీనికి భిన్నంగా ఇప్పుడు మనందరి ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా ఈ పథకం వర్తించేలా అన్ని చర్యలూ చర్యలు తీసుకుంది. వివక్షకు, లంచాలకు తావులేకుండా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఈ పథకం అమల్లో కీలక పాత్ర పోషిస్తుందని, వెల్లడించారు.
రేపటి నుంచి (అక్టోబరు 1) ఈ పథకం అమల్లోకి రానుంది. పెళ్లైన 60 రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నామని…
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు జనవరిలో
జనవరి, ఫిబ్రవరి, మార్చిలో లబ్ధిదారులకు ఏప్రిల్‌లోనూ
ఏప్రిల్, మే, జూన్‌లో ఉన్నవారికి జులైలో
జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో లబ్ధిదారులకు అక్టోబరులో ఈ పథకం కింద లబ్ధి అందిస్తామని భరోసా ఇచ్చారు.
దేవుడి దయతో ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశం రావాలని సిఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ ఎస్ ఎస్ మోహన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో 20వేల ఉద్యోగాలు: సిఎం