Monday, January 20, 2025
HomeTrending Newsనేను నిజాలే చెబుతా: లోకేష్

నేను నిజాలే చెబుతా: లోకేష్

వడ్డెరలపై సిఎం జగన్ కు ప్రేమ ఉంటే సత్యపాల్ కమిటీ నివేదికను బైట పెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. వడ్డెరల నుంచి మంత్రి పెద్దిరెడ్డి క్వారీలు లాక్కున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని వెనక్కుతీసుకుంటామని హామీ వెల్లడించారు. తాను సిఎం జగన్ లా అబద్ధాలు చెప్పనని, నిజాలు మాత్రమే మాట్లాడతానంటూ వ్యాఖ్యానించారు.  వడ్డెరలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని, వారిని చట్ట సభలకు పంపుతామని భరోసా ఇచ్చారు. లోకేష్ పాదయాత్ర నేడు నాలుగో రోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో అడుగుపెట్టింది. పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వడ్డెరలతో  లోకేష్ ముఖా ముఖి నిర్వహించి ప్రసంగించారు. గతంలో వడ్డెరలు డిఎన్డి తెగలో ఉండేవారని, వారిని బిసిల్లో చేర్చారని, దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని తాము సత్య పాల్ కమిటీ  నియమించామని, దాని నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.

తమ హయంలో వడ్డెరలకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, కానీ ఈ ప్రభుత్వం వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకున్నా దాని ద్వారా వారికి ఒరిగిందేమీ లేదని లోకేష్ విమర్శించారు. గతంలో వడ్డెరలు ఎవరైనా ప్రమాదవశాత్తూ  చనిపోతే గతంలో చంద్రన్న బీమా ఉండేదని, కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని పేర్కొన్నారు. తాము ఈ బీమాను 10లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. జగన్ ఇప్పటి వరకూ దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు ఎత్తివేశారన్నారు.

తాము అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు. పలమనేరులో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.  కలిసికట్టుగా నడిచి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకూ విశ్రమించవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్