Sunday, January 19, 2025
HomeTrending Newsమెడికో ప్రీతి కన్నుమూత

మెడికో ప్రీతి కన్నుమూత

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసింది. సీనియర్స్ ర్యాంగింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కోలుకోలేక మరణించినట్లు నిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాత్రి 9:10 నిమిషాలకు ప్రీతి కన్నుమూసినట్లు ప్రకటించారు. ఆమెను బతికించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించామని.. ఫలితం లేకపోయిందన్నారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి.. చివరికి మరణాన్ని జయించలేక ఊపిరి వదిలింది. ఆమె మరణవార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన మెడికల్ విద్యార్థి ప్రీతి.. ట్రైనింగ్‌లో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. తండ్రి రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఏఎస్ఐ నరేందర్. ఆయన విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లి వస్తున్నారు. సీనియర్ మెడికో సైఫ్ వేధింపులు తాళలేక ప్రీతి తనకు తాను.. ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రీతిని తోటి విద్యార్థులు వెంటనే వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎంజీఎం తీసుకెళ్లగా.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకువచ్చారు. నిమ్స్ వైద్య బృందం అన్ని విధాలుగా ప్రయత్నించినా.. చివరికి తుది శ్వాస విడిచింది ప్రీతి.

ప్రీతి హానికర ఇంజెక్షన్లు తీసుకోవడంతో మల్టీఆర్గాన్లు దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా మెదడు బాగా దెబ్బతింది. ప్రీతి మరణవార్తను ప్రకటించకముందే.. బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం ఇచ్చారు. ఇక ఆశలు వదిలేసుకోవాలని వారికి తెలిపారు. అనంతరం 9:10 నిమిషాలకు మరణించినట్లు ప్రకటన విడదల చేశారు. ప్రీతి కోలుకుని ఆసుపత్రిని నుంచి క్షేమంగా తిరిగి వస్తుందనుకుంటే.. మరణ వార్త కలచివేసిందని స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మరణానికి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read :

మనసులేని వారికెలా తెలుస్తుంది?

RELATED ARTICLES

Most Popular

న్యూస్