హైదరాబాద్ లో ఎల్బీనగర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ లో టికెట్ కౌంటర్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రోజు నిరసన చేపట్టారు. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ కాంట్రాక్టు ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అమీర్ పేట లోని మైత్రివనం వద్ద ధర్నా చేపట్టారు. దీంతో మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రోస్టేషన్లలో టికెటింగ్ వ్యవస్థ నిలిచిపోయింది. గత కొంతకాలంగా సరైన జీతభత్యాలు లేవని, ఉద్యోగంలో విధులకు సరైన సమయం లేదని మెట్రో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు ఉద్యోగం చేస్తుంటే రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోరని ఆరోపిస్తున్నారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం కేటాయించటం లేదని విమర్శిస్తున్నారు. ఇలా గత కొంతకాలంగా ఒత్తిడికి గురైన మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్ ఉద్యోగులు ప్రస్తుతం విధులు బహిష్కరించి అమీర్పేట్ హెడ్ ఆఫీస్ వద్ద ధర్నాకి దిగారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు మెట్రో ఉద్యోగుల సమ్మెపై HMRL యాజమాన్యం అసహనం వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రకటించింది. రైళ్ళు సమయం ప్రకారమే నడుస్తున్నాయని వెల్లడించింది. ఉద్యోగులతో చర్చించి… సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.