MLC Kavitha vs MP Aravind: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ బంజర హిల్స్ లోని అరవింద్ నివాసాన్ని ముట్టడించి ఇంటిలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత ఇంట్లోని ఫర్నీచర్, సామాగ్రి ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఎంపీ అరవింద్ ఇంటి ముట్టడికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కవిత పార్టీ మారతారని చెప్పడంతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.
ఈ దాడి ఘటనతో అరవింద్ తల్లి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి దాడులు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.
మరోవైపు దాడి ఘటనపై ఎంపీ అరవింద్ స్పందిస్తూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్‌లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని అన్నారు. ఇంట్లో ఉన్నతన తల్లిని బెదిరించారని పేర్కొంటూ పీఎంవో, ప్రధాని నరేంద్ర మోడీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కుల అహంకారంతోనే తన ఇంటిపై దాడి చేశారని, ఎవరి దమ్ము ఎంతో 2024 ఎన్నికల్లో తేల్చుకుందామని ఎంపీ అరవింద్ సవాల్ చేశారు.
Also Read: అరవింద్ జాగ్రత్త చౌరస్తాలో చెప్పుతో కొడతా కవిత వార్నింగ్