తెలంగాణతో..సీఎం కేసీఆర్తో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై దునుమాడారు.
ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి అభివృద్ధి జరుగలేదన్న తీరుపై ఘాటుగా స్పందించారు. జిల్లాలో కోనసీమను మరిపిస్తున్న పచ్చని పంటచేలు, కంటి రెప్పవేసినంత సేపు కూడా పోని కరెంట్ సరఫరా, ఇంటింటికి శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ, ప్రత్యేక పంచాయతీలుగా మారిన తండాలు, ఆధునిక వైద్యం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలు చూసి మాట్లాడాలని హితవు పలికారు.
బీజేపీ ప్రభుత్వం కేవలం అదాని, అంబానీలకు కొమ్ము కాస్తూ.. వారి బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తుందని విమర్శించారు. బిజెపి అండతోనే వారు అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. కానీ, సీఎం కేసీఆర్ పేదల పక్షం వహిస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రజలు పెద్ద మనసుతో ఆలోచించి సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని ఎంపి కవిత పిలుపు ఇచ్చారు.