Amma: మా తాత పమిడికాల్వ చెంచు నరసింహయ్య, నాన్న చెంచు సుబ్బయ్య ఇద్దరూ సంస్కృతాంధ్రాల్లో పండితులు. తాత ఉపాధ్యాయుడు, పురోహితుడు, ఆయుర్వేద వైద్యుడు, జోతిశ్శాస్త్రవేత్త. భగవద్గీత, సౌందర్యలహరులను తెలుగు పద్యాల్లోకి అనువదించారు. నాన్న అష్టావధాని. త్యాగయ్య భక్తి తత్త్వం మీద పి హెచ్ డి చేశారు. కొన్ని వేల సాహితీ వ్యాసాలు రాశారు. అనేక ఆధ్యాత్మిక వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. అందులో పబ్లిష్ అయినవే 108. రాతప్రతుల్లో మిగిలిపోయినవి, పోయినవి ఎన్నో?
నేను హై స్కూల్ విద్యార్థిగా ఉండగా మా తాత పోయారు. ఆయన దగ్గర ఒకే ఒక్క సంస్కృత శ్లోకం తప్ప నేనేమి నేర్చుకోలేదు. అయిదు నెలల క్రితం మా నాన్న పోయారు. మా నాన్న మంచం మీద మాటలేని స్థితిలో కూడా నా పద్యాన్ని వింటూ తప్పులు పట్టుకునేవారు. ఆయనకు పద్యం పులకింత. మైమరపు. వ్యాకరణం, ఛందస్సు విషయాల్లో చాల కఠినంగా ఉండేవారు. మా నాన్న నేర్పిన తెలుగు ఎంతో చెప్పడానికి నాకు మాటలు చాలవు. అన్నమయ్య మీద నేను రాసిన వంద వ్యాసాల్లో కనీసం 60 ఆయన రాసిచ్చినవే. మొత్తం వ్యాసం రాసిచ్చావు ఎందుకు? పాయింట్లు చెప్తే నేను రాసుకుంటాను కదా? అంటే…అవన్నీ మంత్రార్థాలు… అందులో అక్షర దోషాలు, అన్వయదోషాలు వస్తే మనకు మహా పాపం అని భయపెట్టేవారు. ఆయన చనిపోయిన మరుసటిరోజు “మా నాన్న” పేరిట నివాళి వ్యాసం రాశాను. ఆ లింక్ ఇది.
మా నాన్న పోయి ఆరు నెలలు కూడా కాలేదు. ఇప్పుడు మా అమ్మ కూర్చున్న మనిషి కూర్చున్నట్లు గుండె ఆగి (హిందూపురంలో 31-01-2023 రాత్రి) పోయారు. తాత, నాన్న గురించి తలచుకుని, తలచుకుని రాసే నేను…అమ్మ గురించి ఎలా రాయాలో, ఏమి రాయాలో తెలియక పదాలు వెతుక్కుంటున్నాను.
మా తాత గొప్పతనం గురించి కథలు కథలుగా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలే నాకు తెలుగు పద్యం మీద ఆరాధనగా మారాయి.
రాయబోతే అక్షరాలకు అందని కడప మాండలికం ఉచ్ఛారణ అందం మా అమ్మ ద్వారానే తెలుసుకున్నాను. ఒక జీవిత కాలానికి సరిపడా తెలుగు సామెతలను మా అమ్మ నోట్లోనే విన్నాను. ఏ సందర్భానికయినా ఒక సామెత చెబుతున్నప్పుడు ఆమెలో కూడా నాకు అవధాన సరస్వతి కనిపించేది. బహుశా ఒకనాటి గ్రామీణ జీవితమంతా ఒక పెద్ద సామెతే అయి ఉండాలి.
“ఆవళించిన నోటికి అప్పళించినట్లు…”
“ఉత్తర చూసి ఎత్తర గంప…”
“ఆవడ్డగా బంది ముప్పావలా…”
“తా దూర కంత లేదు మెడకో డోలా?..”
“వేసిన కోడలు విస్తళ్లు వేస్తూనే ఉంది…తీసిన కోడలు తీస్తూనే ఉంది…”
“అత్తా కోడళ్లు ఏమి చేస్తున్నారంటే…ఒలగబోసి ఎత్తేసికుంటున్నారన్నట్లు…”
“ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?”
“కూట్లో ఏరలేనమ్మ ఏట్లో ఏరతానందట…”
“పెడితే పిండం…వద్దంటే గండం…”
“ఎగెరెగిరి దంచినా అదే కూలి…ఎగరకుండా దంచినా అదే కూలి”
“అడుక్కునేప్పుడు ఆది దేవుడయినా జోలె పట్టాల్సిందే”
ఇలా కొన్ని వేల సామెతలు. ఇందులో సగానికి పైగా ఏ సామెతల పుస్తకాల్లో, ఎవరి నోటా ఎప్పుడూ విననివి. వాళ్లమ్మ మాటల్లో దొర్లిన సామెతలట ఇవన్నీ.
నా రాతలకు తొలి పాఠకురాలు మా అమ్మ. కాకి పిల్ల కాకికి ముద్దు అన్న సామెతను కోట్ చేసి మా నాన్న ఎంతగా నా రాతల్లో తప్పులు దిద్దుతున్నా…మా అమ్మ మాత్రం ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరితో నా రాతల గురించి మాట్లాడుతూ ఉండేది.
ఒకసారి శ్రీలంక పర్యటనకు వెళ్లి…రామాయణ కాలంలో సీతమ్మ పది నెలలు కూర్చున్న అశోక వనం చూసి…”సీతా శోకం- లంకా దహనం” అని ఒక వ్యాసం రాశాను. సీతమ్మ కష్టాలను ఎంత గొప్పగా రాసినావురా? కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి…అని మా అమ్మ పొంగిపోయింది. అవునవును నాకూ ఏడుపొస్తోంది…అందులో వాల్మీకి నాలుగు శ్లోకాలను తీసేస్తే…వీడు రాసిందేముంది? అని వెంటనే మా నాన్న పాలపొంగు మీద నీళ్లు చల్లి నన్ను నేలకు దించారు.
నేనెందుకూ కొరగాని వాడినని లోకం గేలి చేసినప్పుడు నన్ను నిలబెట్టింది మా అమ్మ. నేను గెలిచినప్పుడు…గెలుపు నా రక్తంలోనే ఉందని దాన్నొక సాధారణ విషయం చేసింది మా అమ్మ.
ఆనందం పిల్లలకు పంచి…కష్టాలను తాము ఆనందంగా స్వీకరించిన కోట్ల మంది సాధారణ అమ్మల్లో మా అమ్మ కూడా ఒక అతి సాధారణ అమ్మ.
సహనం ముందు సముద్రమయినా చిన్నబోవాల్సిందేనని నేర్పిన మా అమ్మ నాకిచ్చిన సంపద అనంతం. అది రాస్తే మాటలకందేది కాదు. పూర్తి పర్సనల్.
“అమృతానికి , అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి , ఆర్ధ్రతఆనవాలు అమ్మ
ప్రతి మనిషి పుట్టుకకు పట్టుగొమ్మ అమ్మ
ఈలోకమనెడి గుడిజేరగ తొలివాకిలి అమ్మ”
– మాడుగుల నాగఫణి శర్మ
“కుపుత్రో భవతి
కుమాతా నభవతి-
లోకంలో చెడ్డ కొడుకులు ఉంటారేమో కానీ , చెడ్డ తల్లులు ఉండరు”
-శంకరాచార్యులు
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]