Wednesday, May 29, 2024

మా నాన్న

I am here because of you only: మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మగారు మరణించారని తెలిసి చాలా మంది పండితులు, పురోహితులు, తెలుగు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఆయన మిత్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలిపారు. ఆయనతో వారి జ్ఞాపకాలను మధురస్మృతులుగా పంచుకున్నారు.

నా మిత్రుల్లో కొందరు ఆయన గురించి నాలుగు మాటలు రాయాల్సిందిగా కోరారు. నిజమే. ముప్పయ్ అయిదేళ్లుగా నా ప్రతి అక్షరాన్ని సరిదిద్ది నాకు తెలియాల్సిన తెలుగు ఎంత ఉందో తెలిపిన మా నాన్న గురించి రాయకపోతే…నాకు తెలిసిన కొద్దిపాటి తెలుగుకు విలువే లేదు.

Telugu Literature

కడపజిల్లా తాళ్ళపాక పక్కన పెనగలూరులో తెలుగు ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు, పురోహితుడు, జోతిశ్శాస్త్రవేత్త పమిడికాల్వ చెంచు నరసింహయ్య శర్మ పెద్ద కొడుకు మా నాన్న. పెనగలూరులో బడి చదువుల తరువాత తిరుపతిలో ప్రఖ్యాత పండితుడు, అన్నమయ్య సాహిత్యాన్ని వెలికి తీసిన నలుగురిలో ముఖ్యుడు బ్రహ్మశ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ ప్రియ శిష్యుడు అయ్యారు. వారివద్దే అవధాన విద్య నేర్చుకున్నారు. వారే నాన్నను లేపాక్షి ఓరియంటల్ కళాశాలకు లెక్చరర్ గా సిఫారసు చేసి పంపారు.

లేపాక్షి, హిందూపురాల్లో పాతికేళ్ళపాటు భాషా సాహిత్యాలు, అష్టావధానాలతో క్షణం తీరికలేని జీవితం గడిపారు. రాయలసీమ, కొంత భాగం కన్నడ నేలల్లో ఆయన ఉపన్యాసం చెప్పని ఊరు, అవధానాలు చేయని ఊరు లేదు. ఎస్ కే యూనివర్సిటీలో శ్రీ శలాక రఘునాథ శర్మ గైడ్ గా త్యాగరాజు సాహిత్యం మీద పి హెచ్ డి చేశారు.

కవిత్రయ భారతం, పోతన భాగవతం, అన్నమయ్య, త్యాగయ్య రచనల్లో ఏది అడిగినా పుస్తకం చూడకుండా నోటికి చెబుతారు. పోతన అంటే పులకింత. లేపాక్షిలో మా ఇంటి నేమ్ ప్లేట్ – “భాగవత కృప”.

Telugu Literature

నెమ్మదిగా భాషా సాహిత్యాల నుండి ఆధ్యాత్మిక రచనా వ్యాసంగాల వైపు మళ్ళారు. విష్ణు సహస్రం, లలితా సహస్రం, సౌందర్య లహరి, శివానందలహరి ఇతర స్తోత్రాలకు వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. పదవీ విరమణ అయిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మ ప్రచార పరిషత్ సారథ్య బాధ్యతలు నిర్వహించారు. అనేక మంత్రాలకు సరళ వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. మొత్తం వందకు పైగా ఆధ్యాత్మిక వ్యాఖ్యాన గ్రంథాలు పుస్తకాలుగా వెలువడ్డాయి.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యుల రచనలను నాకు రుచి చూపించింది మా నాన్నే.
పద వ్యుత్పత్తిని ఊహించడం నేర్పింది మా నాన్నే.


సంస్కృత శ్లోకం, తెలుగు పద్యం ఏదో ఒక క్రమ రూపంలో పాడడం ద్వారా జ్ఞాపకం ఉంచుకోవడం సులభం అని నేర్పింది మా నాన్నే.
ఛందస్సు, అలంకారాలు, భాషోత్పత్తి, భాషా పరిణామం లెక్కలకంటే గొప్ప లెక్కలుగా తేలే శాస్త్రమని తెలియజెప్పింది మా నాన్నే.
భాష ఒక శ్వాసగా పరిగణిస్తే అన్ని రూపాల్లో ఉన్న భాష ప్రాణం కంటే గొప్పదని నేర్పింది మా నాన్నే.

రాసే భాషలో అక్షర దోషాలు లేకుండా రాయాలని ఆయన నియమం. ఒక చేతికి సెలయిన్ ఎక్కుతుండగా, నోట మాట లేక, పేపర్ మీద రాస్తున్న చివరి క్షణాల్లో కూడా ఫుల్ స్టాపులు, కామాలు, ప్రశ్నార్థకాలతో రాయడం ఆయన నిబద్ధత. 

చివరి రోజుల్లో ఆయన స్పృహను, జ్ఞాపకశక్తిని పరీక్షించడానికి శంకరాచార్యుల రామకర్ణామృతానికి సిద్ధేంద్ర కవి తెలుగు అనువాద పద్యం మూడు పాదాలు ఒక పద్యానివి చదివి, ఒక పాదం మరో పద్య పాదానిది చదివితే…వెంటనే చెయ్యి అడ్డు పెట్టి తప్పు దిద్దారు.

ఆసుపత్రి బెడ్ పై నుండి నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఉందని పలవరిస్తుంటే వీడియో కాల్ చేసి ఆయన ముందు పెట్టారు. ఆయన కళ్లల్లో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. నేను ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు, ఓదార్పుతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయన పెదవి విప్పి మాట్లాడలేకపోయారు.

సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డాక ఆయన స్వర పేటిక మూతపడుతూ వచ్చింది. అరవై ఏళ్లపాటు బతుకు పద్యమై, శ్లోకమై ఖంగుమని మోగిన కంఠం మూగబోయినప్పుడే ఆయన ఈ లోకంతో బంధాలను తెంచేసుకున్నారు. పరీక్షలు చేసిన డాక్టర్లకు వేదాంత పాఠాలు చెప్పి 80లో ఇరవై రాదని క్లారిటీ ఇచ్చారు.

Telugu Literature

అనంతమయిన ఆయన పుస్తక భాండాగారం ఆయన చదివిన తిరుపతి ఎస్ వీ యూనివర్సిటీ లైబ్రరీకి చేరింది.

ఇప్పుడు నా తప్పులను దిద్ది నాకు నిరంతరం తెలుగు నేర్పే గురువు లేడు. గ్రామీణ జీవన విధానంలో సహజంగా, మొండిగా, ధైర్యంగా బతకడం తెలిసిన మా నాన్న లేడు. డబ్బుకు సంబంధం లేకుండా జీవితాన్ని తపస్సుగా ఒక కారణం కోసం వెలిగించుకున్న మా నాన్న లేడు.

“ఆత్మావై పుత్ర నామాసి”.
ఇన్నాళ్లుగా నా మాటల్లో, రాతల్లో, చేతల్లో తెలుగుకు అర్థం ఉండి ఉంటే అది మా నాన్న ఇచ్చినది. తప్పులుంటే నావి.

-పమిడికాల్వ మధుసూదన్

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్