ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు ముఖ్యమంత్రి జగన్ అహంకారం నేలకు దిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ కు 151 సీట్లు ఇచ్చి గెలిపించింది ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడానికా అంటూ ప్రశ్నించారు. అవినీతిపై ప్రశ్నించినందుకు సొంత పార్టీ ఎమ్మేలపైనే కేసు పెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందు చూపిస్తామని సవాల్ చేశారు. యువ గళం పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలో పూర్తి చేసుకొని అనంతపురం నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని, తమ పార్టీ కార్యకర్తలు, నేతల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాలుగేళ్ళలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు, మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. సింహంలాగా సింగల్ గా వస్తామని ఛాలెంజ్ చేసిన జగన్ ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలను బతిమాలుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. జగన్ రాజారెడ్డి రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపించారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ రాజ్యాంగం పవరేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని జగన్ వాలంటీర్లతో ప్రచారం చేస్తున్నారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత 100 పథకాలు నిలిపివేసిన జగన్ పేరును గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించవచ్చని… తాము గతంలో అందించిన పెళ్లి కానుక, పండుగ కానుక, చంద్రన్న భీమా, రంజాన్ తోఫాలను కూడా నిలిపేశారని ధ్వజమెత్తారు.