Tra’fear’: కంటికి కనిపించేదంతా నిజం కాదు. మాయ. ప్రతిబింబాన్నే అసలు రూపం అనుకుంటూ కొన్ని కోట్ల జన్మలు గడిపేస్తామట. అసలు రూపం అంత సులభంగా దొరకదు. గురూపదేశం కావాలి. అంతులేని సాధన కావాలి. శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టుకోవాలి. నిద్రాహారాలు మాని తదేక దీక్షతో తపస్సు చేయాలి. దాన్నే ధ్యానించాలి.
ఇదంతా వేదాంత చర్చ అనుకునేరు. కానే కాదు. ఇది హైదరాబాద్ రోడ్ల మీద యూ టర్న్ లు, డైవర్షన్ల ప్రయోగాల నేపథ్యంలో సామాన్యులకు అవసరమయిన రహదారి సాధనా మార్గం. సాధనా పంచకం. సాధనా త్రిశతి. రహదారి నిష్ఫల శ్రుతి. అగమ్య గోచరం. డెడ్ ఎండ్. వైరాగ్య దశ శ్లోకి.
అద్వైత వేదాంతం అనగానే కఠినమయిన పారిభాషిక, ప్రతీకాత్మక సంకేతాలతో అర్థం కాదనుకుని మనం అనవసరంగా భయపడతాం. నిజానికి మన బతుకులో అడుగడుగునా ఉన్నది అద్వైత వేదాంతమే. పాఠంగా చెబితే వణికిపోతాం. ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే…ఓసి దీని దుంప తెగ! ఇంతేనా? అని అందులో మునిగి అద్వైత సిద్ధి పొందుతాం.
ట్రాఫిక్ పోలీసులు కూడా మనుషులే. రోడ్డుమీద ప్రయాణించే సాటి మనుషుల మీద వారికి ఉండేది సహజమయిన ప్రేమ. అవ్యాజమయిన అనురాగం. 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఇంత ఉత్తమమైనది అయినప్పుడు…ఈ జీవులు సాధనా మార్గంలో ప్రయాణించకుండా ఈ జన్మను వృథా చేసుకుంటున్నారే అని వారికి మన మీద కన్సర్న్. అందులో భాగంగా పిలిచి శంకరాచార్యుల అద్వైత పాఠాలను ట్రాఫిక్ పోలీసులు చెప్పలేరు. చెప్పినా మనం వినం. అందుకు వారికి సులభంగా తట్టిన ఐడియా యూ టర్న్ లు మూసి వేయడం; ట్రాఫిక్ డైవర్షన్లు.
అంతా మిథ్య
మనకు బాగా అలవాటయిన దారే కదా అని రోడ్డెక్కుతాం. కళ్లు మూసుకుని గుడ్డిగా కూడా గమ్యం చేరగలమన్న మన నమ్మకం ఎంత గుడ్డిదో మూతపడ్డ యూ టర్న్ లు చెబుతుంటాయి. మనం చేరాల్సిన గమ్యం కొండగుర్తులతో పాటు కనిపిస్తూ పక్కన, ఎదురుగానే ఉంటుంది. కానీ మనం అక్కడికి చేరాలంటే ప్రయాణించాల్సిన దారి కొండవీటి చేంతాడులా, హనుమంతుడి తోకలా పెరిగిపోతూనే ఉంటుంది. కుడి పక్క పది అడుగుల్లో ఉన్న చోటుకు వెళ్లడానికి…ఎదురుగా ముందుకు అయిదు కిలో మీటర్లు వెళ్లి…వెనక్కు అయిదు కిలోమీటర్లు వస్తేకానీ మన వెళ్లాల్సిన చోటు మనకు దొరకదు. కంటికి కనిపించేదంతా నిజం కాదు. అద్దంలో ప్రతిబింబంలా అంతా మిథ్య!
గురూపదేశం
స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఉంది కదా అని మీరు బయలుదేరే ముందు లొకేషన్ సరిగ్గానే పెట్టుకుంటారు. పాపం ఆ గుడ్డి గూగుల్ కు ఏమి తెలుసు కొత్తగా వచ్చిన ట్రాఫిక్ బాస్ యూ టర్న్ ల నోరు మూసి, కాలు కట్టేశారని!
గమ్యం చేరాలంటే ఉండాల్సింది గూగుల్ మ్యాప్ కాదు. కావాల్సింది సరయిన గురూపదేశం!
సాధన
సాధనమున పనులు సమకూరు ధరలోన. ఊరికే రెండు నిముషాల్లో మనం రోడ్డు మీద గమ్యం చేరితే సాధనకు అవకాశం ఉండదని…మనల్ను అనేక సాధనా మార్గాల్లో తిప్పడానికి వారు ఎన్నో తిప్పలు పడుతున్నారు.
శరీర కష్టం
తపస్సులో మన శరీరాన్ని మనమే కష్టపెట్టుకోవాలి. ఉపవాసాలు ఉండాలి. ఎండాలి. తడవాలి. వణకాలి. శుష్కి శల్యం కావాలి. అది రోడ్డు మీదే సాధ్యం. ట్రాఫిక్ లో అది అనితర సాధ్యం.
నిద్రాహారాలు మానాలి
పక్కనే ఇల్లు కనిపిస్తున్నా యూ టర్న్ ఉండదు కాబట్టి బాలకృష్ణ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటిదగ్గర కుడి వైపుకు తిరగాల్సిన వారు ఒక్కోసారి విధిలేక ఆయన హిందూపురం ఇంటిదాకా వెళ్లి అక్కడ తూరుపు తిరిగి దండం పెట్టాల్సి రావచ్చు. అందువల్ల నిద్రాహారాలను త్యాగం చేయక తప్పదు.
గమ్యం లేని పయనం
తానొకటి తలిస్తే…దైవమొకటి తలుస్తుంది. మనం జూబ్లీహిల్స్ చట్నీస్ కు ఆకలిగా రోడ్డెక్కితే…ఆ రోడ్డు నేరుగా అపోలో బెడ్డు మీదికి చేర్చవచ్చు. రోడ్డెక్కేవరకే మన విధి. తరువాత విధి ఆడే వింత యూ టర్నుల్లో ఏ టర్నూ దొరకక మన టర్న్ ఎప్పటికి వస్తుందో తెలియక నిరీక్షించాల్సిందే. ఇదొక గమ్యం లేని పయనం.
పక్క చూపులతో ప్రమాదం
సాధకుడికి పక్క చూపులు అస్సలు ఉండకూడదు. అందువల్ల బరువెక్కిన గుండెతో అన్ని కుడి, ఎడమ యూ టర్న్ లను మూసేయాల్సి వచ్చింది.
డెడ్ ఎండ్
రహదారికి వ్యతిరేక పదం విరహదారి కాకపోయినా…కొత్తగా కాయిన్ చేస్తే రోడ్డు ఏమీ అనుకోదు. ప్రేయసీ ప్రియులదే విరహవేదన కావాల్సిన పనిలేదు. రహదారి వేదాంతంలో అందరిదీ విరహదారే కావచ్చు. కావాలి. కాకపోతే దారులన్నీ గోదారులే అయి కూర్చుంటాయి.
డెడ్ ఎండ్ అంటే చావు ముగింపు కాదు. ఇక వెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేని స్థితి. యూ టర్న్ లు తొలగించాక…డెడ్ ఎండ్ ప్రస్తావనే రాదు. ఎంతదూరం వెళ్లినా డెడ్ ఎండ్ రాదు. వెళుతూనే ఉండవచ్చు.
రహదారితో మమేకమై, రహదారిలోనే మిగిలిపోయే ఒకానొక అద్వైత సాధనా మార్గమిది!
న్యూటన్ మళ్లీ పుట్టినా…కనుక్కోలేని యూ టర్న్ వేదాంతమిది!!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :