సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సిత్రాంగ్ తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దీనికి తోడు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలకు కారణమా అవుతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండం అవుతుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. నైరుతి రుతుపవనాల కాలం అయిపోయింది. ఇక ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలోనే మొదలవుతాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి. దీంతో దక్షిణ కోస్తాలో విరివిగా వర్షాలు పడతాయి. రాయలసీమలో కూడా అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.