Sunday, January 19, 2025
HomeTrending Newsచేనేత కార్మికులకు కేంద్రం రిక్త హస్తం : కేటీఆర్

చేనేత కార్మికులకు కేంద్రం రిక్త హస్తం : కేటీఆర్

కేసీఆర్ ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ కు చేనేత కార్మికుల కన్నీటి గాధలు తెలుసన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులు బతుకులు ఆగమయ్యాయని, స్వరాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం ఇప్పటివరకు 5 వేల 752 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు.

నూలు, రసాయనాల మీద 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్నలకు సంబంధించి ఏమైనా పాత బకాయిలు ఉంటే వెంటనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నేతన్నల డిజైన్లను ఎవరైనా కాపీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 37 వేల వరకు మర మగ్గాలు, 16 వేల వరకు చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు భీమా పథకాలు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా రైతు బీమా లాగానే చేనేత కార్మికులకు కూడా ప్రభుత్వం బీమా ఇస్తోందని, దురదృష్టవశాత్తు ఎవరైనా చేనేత కార్మికుడు చనిపోతే వారం రోజుల్లో రూ.5 లక్షలు బీమా చెల్లిస్తున్నామని తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులకు నెలకి రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. పద్మశాలిల కోసం కోకాపేటలో పద్మశాలి ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.


చేనేత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసింది శూన్యం..
రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం కేంద్రం చేసింది శూన్యమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మోడీ పీఎం అయ్యాక ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్, చేనేత కార్మికుల బీమాను రద్దు చేశారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ చేనేత ఉత్పత్తుల మీద 5 శాతం జీఎస్టీ విధించి.. వారికి రిక్త హస్తం చూపారని మండిపడ్డారు. వస్త్ర ఉత్పత్తిలో శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే కూడా భారత్ ఎందుకు వెనకబడి ఉందో మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో చిచ్చు పెట్టాలనుకునే వాళ్లను నమ్మొద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్