చంద్రబాబుకు రాజకీయంగా ఎప్పుడు కష్టం వచ్చినా అప్పుడు కలుగులోనుంచి బైటికి వచ్చే నేతలు పెద్ద మనుషులా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. మంత్రుల మీద, మహిళ నేతల మీద జనసేన కార్యకర్తలు దాడి చేస్తే పవన్ కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు కోసం పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నాని దుయ్యబట్టారు. నాడు ముద్రగడ పద్మనాభంను పరామర్శించడానికి చిరంజీవి వస్తే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లోనే ఆయన్ను అడ్డుకుంటే అప్పుడు పవన్ ఏం చేశారని నిలదీశారు. తుని ఘటన వైసీపీ చేయించిందని పవన్ చెప్పడం దుర్మార్గమని, బాబు కోసం మరీ ఇంత దిగజారి మాట్లాడాలా అని అడిగారు. ఆ ఘటనలో బాబు ప్రభుత్వం కాపు యువత మీద కేసులు పెడితే వాటిని ఎత్తి వేసింది సిఎం జగన్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు విషయంలోకూడా ద్వంద్వ వైఖరి ప్రదర్శించారని గుర్తుచేశారు. సిఎం జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నా, గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపైనే పవన్ విమర్శలు చేస్తూ వస్తున్నారని పేర్ని అన్నారు. పవన్ కు ఒకటి రెండు కాదని నాలుగు నాలుకలు ఉన్నాయని, ఎప్పుడూ మాట మారుస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు.
విశాఖ ఘటనకు సంబంధించి ప్రజల్లో సానుభూతి కోసం జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని, ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారని అన్నారు. నేడు జరిగిన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని వ్యాఖ్యానించారు. విశాఖ ఘటనలో అరాచకం సృష్టించిన వారిని అభినందిస్తూ తీర్మానం చేయడం ఏమిటని ప్రశ్నించారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నా జనసేన కార్యక్రమానికి, అదే విధంగా విశాఖ గర్జనకు కూడా పోలీసులు అనుమతించారని నాని పేర్కొన్నారు.
పవన్ ఇప్పటికైనా నిజాయతీగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలైనా సంతోషిస్తారని, ఈ దిశలో ఆలోచన చేయాలని ఆ పార్టీలో ఉన్న ఇద్దరే ఇద్దరు నేతలకు చెబుతున్నా అంటూ పవన్, నాదెండ్ల మనోహర్ లను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
Also Read : పవన్ రాజకీయప్రవచనకారుడు : పేర్ని నాని