ప్రభుత్వ గూండాయిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాతుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో కూల్చివేతలను నిరసిస్తూ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో వాహనం దిగి పాదయాత్రగా జనసేన కార్యకర్తలతో కలిసి పవన్ ఇప్పటం చేరుకున్నారు. జనసేన కార్యకర్తలకు, పోలీసులకు మధ్య మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఈ ఘటనలో పోలీసుల తప్పు ఏమీ లేదని, ప్రభుత్వం ఏమి చెబితే అది చేస్తున్నారని, పోలీసులతో గొడవకు దిగవద్దని, వారు అడ్డుకున్నా మౌనంగా నడుచుకుంటూ వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఇప్పటం గ్రామంలో మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గార్ల విగ్రహాలు కూల్చి వేశారని, కానీ వైఎస్ గారి విగ్రహం మాత్రం అలాగే ఉంచారని అన్నారు. పోలీసు అధికారులు రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పనిచేయాలని, అధికారులు స్పృహతో మెలగాలని హితవు పలికారు.
తమ పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చారని పవన్ ఆరోపించారు. రక్తం చిందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇది కాకినాడా, రాజమండ్రా రోడ్లు వెడల్పు చేయడానికి అని ప్రశ్నించారు, ఎమ్మెల్యే ఆర్కే ఇళ్లు ఉన్న పేద కాకానిలో రహదారి విస్తరణ ఎందుకు చేయడంలేదన్నారు. వైసీపీ ఇలాగే చేస్తే తాము ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు గానీ విస్తరణ కావాలా అని నిలదీశారు.
రాష్ట్రానికి సజ్జల రామకృష్ణారెడ్డి డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో జనసేన కార్యకర్త ఎవరి ప్రాణాలు పోయినా ఆయనే బాధ్యత వహించాలని సంచలన వ్యాఖ్యలు పవన్ చేశారు. మీరు రెక్కీలు నిర్వహించుకోండి, కిరాయి మూకలు సుపారీలు ఇచ్చుకోండి దానికి మీరే బాధ్యత వహించాలని సజ్జలను ఉద్దేశించి అన్నారు.