చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సహకరించవద్దని పోలీసులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలీసు అనేది ఒక యూనిఫాం ఫోర్స్ అని, వారు చట్ట ప్రకారం పని చేయాల్సి ఉంటుందన్నారు. తాము ప్రకటించిన సహాయ నిరాకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిన్న అనపర్తిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు పరామర్శించారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ నిన్న అనపర్తిలో పోలీసుల లాఠీ ఛార్జ్ ను తీవ్రంగా ఖండించారు.
సిఎం తో పాటు సకలశాఖ మంత్రి సజ్జల, పోలీసు అధికారులు రఘురామి రెడ్డి, సునీల్, సీతారామాంజనేయులు ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాడు గాంధీజీ దండి యాత్రను ప్రారంభించారని, అదే కోవలో తాము అనపర్తి మార్చ్ కు పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకు పెట్టారని నిలదీశారు.
తన పోరాటం రాష్ట్ర ప్రజలకోసం. భవిష్యత్ కోసమని వెల్లడించారు. సమాజంలో అన్ని వర్గాల వారూ ఈ ప్రభుత్వంలో తీవ్రంగా బాధపడుతున్నారని, అన్ని వృత్తులూ దెబ్బ తిన్నాయని… ఈ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తే తాము సహకరిస్తామని చెప్పారు.
Also Read : దళితులను ఆదరించింది మేమే: బాబు