Saturday, November 23, 2024
HomeTrending Newsఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం

ఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం

విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం సవరణ బిల్లు -2022ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది.  ఎన్ని పథకాలకు వైఎస్సార్ పేరు పెట్టుకుంటారని,  ఎప్పటినుంచో కొనసాగుతున్న ఎన్టీఆర్ పేరును మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై అసెంబ్లీ లో టిడిపి తీవ్ర నిరసన వ్యక్తం చేసి సభా కార్యకలాపాలను ఆడ్డుకుంది.  టిడిపి అధినేత, మాజీ సిఎం చంద్రబాబు కూడా  ఈ పేరు మార్పు విషయమై తీవ్రంగా స్పందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదన్నారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా బాబు స్పందించారు.

“హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టాము. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదు.

36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోంది.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం….ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉంది?

దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా… ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: వైఎస్సార్సీపీకి 67లోపే: పవన్ కళ్యాణ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్