Sunday, January 19, 2025
HomeTrending NewsPakistan: పాకిస్తాన్ లో నిరసనల హోరు

Pakistan: పాకిస్తాన్ లో నిరసనల హోరు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌తో ఆ దేశం అట్టుడుకుతోంది. అరెస్ట్‌ తర్వాత చెలరేగిన అల్లర్లు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లోని క్వెట్టా, కరాచీ, పెషావర్, రావల్పిండి, లాహోర్‌ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టిస్తున్నారు. పెషావర్ లో రేడియో కేంద్రానికి నిప్పు పెట్టడంతో అగ్నికి ఆహుతి అయింది. సుమారు 500 మందికిపైగా పీటీఐ మద్దతుదారులు లాహోర్‌లోని పాక్‌ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇంటిని చుట్టుముట్టారు. ప్రధాని భవనంలోకి పెట్రోల్‌ బాంబులు విసిరి నిరసన చేపట్టారు. అనంతరం అక్కడ పార్క్‌ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో ప్రధాని నివాసం వద్ద గార్డులు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు బలగాలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకారులు పరారైనట్లు అధికారులు వెల్లడించారు.

ప్రధాని నివాసానికి చేరుకోవడానికి ముందు ఆందోళనకారులు మోడల్‌ టౌన్‌లోని అధికార పీఎంఎల్-ఎన్ సెక్రటేరియట్‌పైనా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడున్న బారికేడ్లకు నిప్పు పెట్టినట్లు చెప్పారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లో రెండు రోజుల్లోనే మొత్తంగా 14 ప్రభుత్వ భవనాలు, 21 పోలీసు వాహనాలకు నిప్పు పెట్టినట్టు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్‌ అరెస్ట్‌కు నిరసనగా పీటీఐ మద్దతుదారులు లండన్‌లోని షేబాజ్ షరీఫ్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేసినట్లు చెప్పారు.

అవినీతి కేసులో నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్‌ ఖాన్‌ మంగళవారం అరెస్టైన విషయం తెలిసిందే. అవినీతి కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను పారామిలటరీ రేంజర్స్‌ కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కోర్టు విచారణ చేపట్టారు. అవినీతి కేసులపై ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రశ్నించేందుకు పది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఏబీ కోర్టును కోరింది. అయితే 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 17న ఇమ్రాన్‌ ఖాన్‌ను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్