Monday, February 24, 2025
Homeసినిమారాజమౌళి రిలీజ్ చేసిన 'దసరా' టీజర్!

రాజమౌళి రిలీజ్ చేసిన ‘దసరా’ టీజర్!

మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఎక్కువగా నటన ప్రధానమైన వైవిధ్యాన్ని కనబరుస్తూ వచ్చిన నాని, ఈ మధ్య కాలంలో పాత్రకి తగిన వేషధారణలో కనిపించడానికి ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’తో పాటు తాజాగా చేస్తున్న ‘దసరా’ సినిమా కూడా అందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఆయన పూర్తి మాస్ లుక్ తో కనిపించనున్నాడు.

మార్చి 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రాజమౌళి చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. ఈర్లపల్లి అనే గ్రామంలో ఈ కథ నడుస్తుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ‘చుట్టూ బొగ్గు కుప్పలు .. తొంగిచూస్తేనే తప్ప కనిపించని ఊరు’ అంటూ నాని వాయిస్ ఓవర్ తో ఆ ఊరు పరిచయం జరిగింది. గ్రామీణస్థాయిలో అక్కడ జరిగే రాజకీయాలు .. కత్తులు .. కటార్లతో జరిగే పోరాటాలు చూపించారు.

‘మందంటే మాకు వ్యసనం కాదు .. అలవాటైన సంప్రదాయం’ అనే నాని డైలాగ్ ను బట్టి అక్కడివారి తీరు అర్థమవుతోంది. యాక్షన్ తో కూడిన సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక అయినప్పటికీ, ఆమెకి సంబంధించిన ప్రస్తావన లేకుండానే టీజర్ వదిలారు. సాయికుమార్ .. సముద్రఖని ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్