రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెబుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. తాము వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తా జనసభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల విద్యుత్ పై ఏ సబ్ స్టేషన్ వద్దకైనా వెళదామని…ముఖ్యమంత్రి వచ్చినా..మంత్రి వచ్చినా పర్లేదన్నారు. లేకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాయాలని అన్నారు. తెలంగాణలో సబ్బండవర్గాలు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామని కరీంనగర్ గడ్డమీద సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పోరాటాలతో ఏర్పడిన తెలంగాణలో 60 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరాయా? ఒక్కసారి ఆలోచించాలని కోరారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ తెలంగాణ కోసం కొట్లాడలేదన్నారు. వీళ్లు సుష్మాస్వరాజ్ ను కలిసి ఒప్పించలేదని మండిపడ్డారు. ఆనాడు తెలంగాణ ప్రజల బాధను చెప్పి సుష్మాస్వరాజ్ కాళ్లకు దండం పెట్టి ఆమెను ఒప్పించింది పొన్నం ప్రభాకర్ అని గుర్తు చేశారు.
బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి ని అమిత్ షా పిలిపించుకుంటే..పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం కోసం అనుకున్నానని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మూడుగంటలు కూర్చోబెట్టి ముచ్చట చెప్పిండు తప్ప తెలంగాణకు చేసిందేం లేదని రేవంత్ విమర్శించారు. తెలంగాణలో మోదీ 70లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే.. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. కేసీఆర్ అవినీతిపై ఇప్పటి వరకు ఎందుకు విచారణకు ఆదేశించమని అడగలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ నేతలు మాత్రమే కొట్లాడుతామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఎప్పటిలోగా కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి కేసీఆర్, కేటీఆర్ ను జైల్లో పెడతారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆరెస్ రెండు పార్టీలు ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేందుకే వేరుగా ఉన్నట్లు నటిస్తున్నారని తెలిపారు.