రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే రేపు ఉదయం 10 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఈడీ, సీబీఐ దాడులకు భయపడం అని రోహిత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇవాళ ఉదయం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఈడీ నోటీసులు చూసి లాయర్లే ఆశ్చర్యపోతున్నారు. ఈడీ నోటీసుల్లో తన వ్యక్తిగత బయోడేటా మాత్రమే అడిగారని తెలిపారు. తన బయోడేటా పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది. దానికి నోటీసులు ఇవ్వాలా? అని అడిగారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఈడీ నోటీసులపై న్యాయపోరాటం చేస్తాం. తప్పుడు ఆరోపణలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందని రోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు.
నాకు డ్రగ్స్ కేసులో నొటీసులు వచ్చినట్లు చూపించు బండి సంజయ్ కు తంబాకు వల్ల నోరు తిరుగతలేదని విమర్శించారు. మాకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపికి ముందే ఎలా తెలుసు..బీజేపీ కి అబద్దాలు చెప్పడం కామన్ గా మారిందన్నారు. నాకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చాయని చెప్తున్న బీజేపీ ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.