Monday, January 20, 2025
HomeTrending Newsభారత్ విదేశాంగ విధానంపై పుతిన్ ప్రశంసలు

భారత్ విదేశాంగ విధానంపై పుతిన్ ప్రశంసలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్… ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.  భారత ప్రధాని అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానంతోపాటు ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాల్ని కూడా పుతిన్ ప్రశంసించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడన్నారు.

మాస్కోలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై స్పందించిన పుతిన్… ప్రధాని మోడీ విదేశాంగ విధానాన్ని  ప్రస్తావించారు. ‘‘దేశం కోసం, ప్రజల కోసం స్వతంత్రంగా విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్న కొద్ది మంది ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్య సాధనలో ముందుకెళ్తున్నారు. ఇండియాలాంటి దేశాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో.. ప్రపంచ రాజకీయాల్లో ఇండియా కీలకపాత్ర పోషిస్తుంది. ఇండియాతో మాకు ఎలాంటి సమస్యా లేదు. అన్ని విషయాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాం.భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగుతుంది. ప్రధాని మోదీ కోరినట్లుగా ఇండియాకు ఎరువుల సరఫరా కూడా పెంచాం. ఇది ఇండియాలో వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇండియాకు 7.6 రెట్లు అదనంగా ఎరువులు అందిస్తున్నాం’’ అని పుతిన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు  ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయనే అంశంపై కూడా పుతిన్ స్పందించారు. ఆ అవసరం తమకు లేదన్నారు. అణ్వస్ర్తాలు వాడే ఉద్దేశం రష్యాకు లేదని స్పష్టం చేశారు. అయితే ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే పాశ్చాత్య దేశాల వైఖరి చాలా ప్రమాదకరమని, దీన్ని ఎదుర్కోలేకపోతున్నామని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : సైనిక శిక్షణ శిబిరం సందర్శించిన పుతిన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్