Saturday, November 23, 2024
Homeసినిమా'సార్' పరిస్థితి ఎలా ఉండనుంది?

‘సార్’ పరిస్థితి ఎలా ఉండనుంది?

కోలీవుడ్ హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకోవడం కోసం, తమ సినిమాలను ఇక్కడ కూడా తప్పకుండా రిలీజ్ చేస్తూ వెళుతున్నారు. తమిళంతో పాటు తెలుగులో ప్రమోషన్స్ లోను సందడి చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు మరింత ఓన్ చేసుకోవడం కోసం, నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. టాలీవుడ్ దర్శక నిర్మాతలను రంగంలోకి దింపుతున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమానే ‘సార్‘.

ధనుశ్ హీరోగా సితార బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇదే రోజున తమిళంలో ‘వాతి’ టైటిల్ తో విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అయితేనే అక్కడి హీరోలు ఈ పద్ధతిని ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే ధనుశ్ కంటే ముందుగానే విజయ్ ‘వారసుడు’తో ఇదే ప్రయోగం చేశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా కోసం ఏ రకం కెమెరా వాడారో .. ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారో తెలియదుగానీ, పిక్చర్ క్వాలిటీ మాత్రం కట్టిపడేస్తుంది.  చిన్న చిన్న పాత్రలను సైతం పెద్ద ఆర్టిస్టులతో చేయించిన సినిమా ఇది.

ఈ సినిమాకి తమన్ సంగీతం .. రష్మిక హీరోయిన్. హీరో.. హీరోయిన్ కాంబినేషన్లోని రెండు డ్యూయెట్లు హిట్. ఈ సినిమా ఇక్కడ భారీ వసూళ్లనే సాధించిందని అన్నారు. కానీ ఎందుకో ఈ సినిమాను గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకోలేదు. విజయ్ కి ఉన్న మాస్ ఇమేజ్ కి భిన్నమైన కంటెంట్ తో చేయడమే అందుకు కారణమనే అభిప్రాయాలు వినిపించాయి. కథాకథనాల సంగతి తెలియదుగానీ, బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా ‘సార్’ ఆ స్థాయి సినిమా కాదు. మరి ‘సార్’ పరిస్థితి ఏంటి? అనేది రిలీజ్ రోజునగాని తెలియదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్