ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ ఎవరూ ట్యాపింగ్ చేయలేదని,ఆయన విడుదల చేసింది ఆడియో రికార్డింగ్ మాత్రమేనని… కానీ శ్రీధర్ రెడ్డిని టిడిపి మ్యాన్ ట్యాపింగ్ చేసిందని ఎద్దేవా చేశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఒకటి అయితే ఆయన పక్కన తాము సున్నాలు లాంటి వాళ్ళమని, ఒకటి పక్కన చేరితేనే తమకు విలువ ఉంటుందని, ఈ విషయం శ్రీధర్ రెడ్డి తెలుగు కోవాలని హితవు పలికారు. 2014, 19 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని చూసే ప్రజలు తమను గెలిపించారని, ఈ విషయాన్ని శ్రీధర్ రెడ్డి ఎన్నోసార్లు స్వయంగా చెప్పుకున్నారని కాకాణి గుర్తు చేశారు.
ట్యాపింగ్ అంశంపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి, హోం శాఖకు మూడు రోజులుగా ఎందుకు లేఖ రాయలేదని, ఎందుకు కోర్టుకు వెళ్లలేదని మంత్రి ప్రశ్నించారు. అసలు అక్కడ ఏమీ లేదు కాబట్టే వెళ్ళలేకపోయారని అన్నారు. నిన్నటి వరకూ ఆయన సిఎం జగన్ కు విధేయుడని, కానీ ఇప్పుడు వేరొక వ్యక్తికి విధేయుడిగా మారాడని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తెలుగుదేశం పార్టీ లాక్కొని, పార్టీని బలహీన పరచాలని, భూస్థాపితం చేయాలని అనుకున్నప్పుడే జగన్ చలించలేదని, ప్రజల్లోకి వెళ్లి పోరాడి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన జగన్ కు పోయేదేమీ లేదన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు జగన్ ను చూసి లోకేష్ యువ గళం పేరుతో యాత్ర చేస్తుంటే కనీస స్పందన లేదని, అందుకే చంద్రబాబు ఇలాంటి వారిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఈయన భుజంపై తుపాకీ పెట్టి వైసీపీని కాల్చాలని బాబు చూస్తున్నారని అన్నారు.
శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమని, తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తరువాతే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఒక్కసారి అయన ఏమి మాట్లాడుతున్నారో అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయానికి, పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా సజ్జల రామకృష్ణా రెడ్డి పని చేస్తున్నారని, ఆయనపై శ్రీధర్ రెడ్డి విమర్షలు చేయడం సరికాదన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా నియమించారని, అందరం కలిసి పనిచేసి పార్టీని మళ్ళీ గెలిపిస్తామని స్పష్టం చేశారు.
Also Read : నా గొంతు నొక్కలేరు: శ్రీధర్ రెడ్డి